మంధనాధన్, స్మృతి, పెర్రీ మెరుపులు యూపీపై ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ గెలుపు

మంధనాధన్, స్మృతి, పెర్రీ మెరుపులు యూపీపై ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ గెలుపు

 బెంగళూరు: సొంతగడ్డపై చివరి మ్యాచ్‌‌‌‌లో  కెప్టెన్ స్మృతి మంధాన (50 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) ధనాధన్ ఇన్నింగ్స్‌‌‌‌కు తోడు ఎలైస్ పెర్రీ (37 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) కూడా ఫిఫ్టీలతో సత్తా చాటడంతో డబ్ల్యూపీఎల్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 23   రన్స్ తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌ను ఓడించింది.  తొలుత ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ 20 ఓవర్లలో 198/3 భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో యూపీ ఓవర్లన్నీ ఆడి 175/8 స్కోరుకే పరిమితం అయింది. కెప్టెన్ అలీసా హేలీ (38 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) పోరాడింది. ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లలో  డివైన్‌‌‌‌, మొలినుక్స్‌‌‌‌, వారెహమ్‌‌‌‌, శోభన రెండేసి వికెట్లు పడగొట్టారు.  మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

ధనాధన్ ఫటాఫట్

గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ ఈ పోరులో బలంగా పుంజుకుంది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన జట్టుకు ఓపెనర్లు సబ్బినేని మేఘన (28), మంధాన మంచి ఆరంభాన్ని అందించారు. అంజలి వేసిన రెండో ఓవర్లో చెరో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. గైక్వాడ్, చామరి బౌలింగ్‌‌‌‌లో రెండు సిక్సర్లతో మంధాన టాప్‌‌‌‌ గేర్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేసింది. ఆరో ఓవర్లో అంజలి బౌలింగ్‌‌‌‌లో మేఘన ఔటవడంతో తొలి వికెట్‌‌‌‌కు 51 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్ అయింది. అయితే జోరు మీదున్న మంధానకు వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఎలైస్ పెర్రీ తోడవడంతో ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ స్కోరుబోర్డు మరింత వేగం పుంజుకుంది. 

ఇద్దరూ పోటాపోటీగా బౌండ్రీలు కొట్టారు. ఈ క్రమంలో 12వ ఓవర్లోనే స్కోరు వంద దాటగా.. మంధాన 34 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఆపై మరింత స్పీడు పెంచి 15,16వ ఓవర్లో మూడేసి  మూడు ఫోర్లతో అలరించింది. అయితే, సెంచరీ దిశగా వెళ్తున్న మంధానను 17వ ఓవర్లో దీప్తి స్లోబాల్‌‌‌‌తో ఔట్ చేయడంతో రెండో వికెట్‌‌‌‌కు 95 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్ అయింది. 

స్మృతి ఔటైన తర్వాత పెర్రీ చెలరేగింది. గైక్వాడ్ వేసిన 18వ ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టగా.. రిచా ఘోశ్‌‌‌‌(21 నాటౌట్‌‌‌‌) సిక్స్ బాదడంతో 21 రన్స్‌‌‌‌  వచ్చాయి. తర్వాతి ఓవర్లో  మరో 4,6తో  ఫిఫ్టీ (35 బాల్స్‌‌‌‌) పూర్తి చేసుకున్న పెర్రీ లాస్ట్ ఓవర్లో ఔటైంది. చివరి బాల్‌‌‌‌కు ఫోర్ కొట్టిన రిచా ఇన్నింగ్స్‌‌‌‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. 

హేలీ మెరిసినా

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో యూపీ కూడా ధాటిగానే ఆడినా ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ  ఆ జట్టును కట్టడి చేశారు. కెప్టెన్, ఓపెనర్ అలీసా హేలీ రెండో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టగా, రేణుకా సింగ్ బౌలింగ్‌‌‌‌లో యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ నవగిరె (18) వరుసగా 6,4,4 కొట్టడంతో మూడు ఓవర్లకే యూపీ 40  రన్స్‌‌‌‌ చేసింది. అయితే ఐదో ఓవర్లో నవగిరెను ఔట్‌‌‌‌ చేసిన డివైన్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ బ్రేక్‌‌‌‌ ఇచ్చింది. ఏడో ఓవరో ఆటపట్టు (8)ను వారెహమ్ ఎల్బీ చేయగా, కాసేపటికే గ్రేస్ హారిస్‌‌‌‌ (5)ను డివైన్‌‌‌‌ వెనక్కుపంపింది. 

అయినా హేలీ అదే జోరు కొనసాగించింది. శ్వేత(1) ఫెయిలైనా  దీప్తి శర్మ (33) తోడుగా హేలీ 11 ఓవర్లకే స్కోరు వంద దాటించింది. హేలీ, దీప్తి క్రీజులో కుదురుకోవడంతో యూపీ టార్గెట్‌‌‌‌ను ఛేజ్‌‌‌‌ చేసేలా కనిపించింది. కానీ, 13వ ఓవర్లో ఊరించే బాల్‌‌‌‌తో హేలీని స్టంపౌట్‌‌‌‌ చేసిన మొలినుక్స్‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీని తిరిగి రేసులోకి తెచ్చింది. ఆపై, ఖెమ్నార్ (31) తోడుగా  పోరాడిన దీప్తి ఆశలు రేకెత్తించింది. కానీ, 18వ ఓవర్లో దీప్తిని శోభన రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌తో ఔట్‌‌‌‌ చేసి యూపీ ఆశలపై నీళ్లు కుమ్మరించింది.