
- 3 కి.మీ మేర కరకట్ట నిర్మాణానికి నిర్ణయం
- సిద్దిపేట కోమటిచెరువు, వరంగల్ భద్రకాళి చెరువు తరహాలో అభివృద్ధి
- రూ. 25 కోట్లు విడుదల చేసిన సర్కార్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గోదావరి బ్యాక్‌వాటర్‌తో జలకళను సంతరించుకుంటున్న మానేరు తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ భద్రకాళి చెరువు, సిద్దిపేట కోమటచెరువు తరహాలో ట్యాంక్ బండ్ నిర్మించి అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. దీనికోసం రెండు రోజుల కింద ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. దీంతోపాటు మానేరు తీరంలో ఉన్న సాయిబాబా ఆలయం వద్ద చెక్ డ్యాం నిర్మించేందుకు రూ.13 కోట్లు కేటాయించింది.
3 కి.మీ మేర కరకట్ట
సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి మధ్య బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కింద ఎదురెక్కిన గోదావరి జలాలతో మానేరు జలకళను సంతరించుకుంటోంది. మానేరు తీరానికి కుడివైపున ముందుగా సిరిసిల్ల మానేరు తీరం బతుకమ్మ ఘాట్ నుంచి సాయిబాబా టెంపుల్ వరకు 3 కి.మీ మేర కరకట్ట నిర్మించి ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. దీనికోసం నిధులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కరకట్టకు కుడివైపున మానేరు నీరున్న ప్రాంతంలో 3 కిలోమీటర్ల మేర రాయితో ఫిచ్చింగ్ చేయనున్నారు. కరకట్ట నిర్మాణం పూర్తయ్యాక తర్వాత దానిపై వాకింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లు చేయడానికి మరిన్ని నిధులు కోసం ఆఫీసర్లు ప్రతిపాదనలు చేయనున్నారు. విడతలవారీగా మానేరు తీరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి రామప్ప గుట్టల వరకు కరట్టను నిర్మించారు. కానీ ఇతర ఏర్పాట్లు ఏం చేయలేదు. ఓ వారం రోజులు రెండు బోట్లతో ట్రయల్ రన్ నిర్వహించి వదిలేశారు. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 25 కోట్లు కేటాయించింది.
రూ.13 కోట్లతో చెక్ డ్యాం
మానేరు తీరంలో ఉన్న సాయిబాబా ఆలయం వద్ద చెక్ డ్యాం నిర్మించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనికోసం రూ.13 కోట్లు కేటాయించింది. గత సర్కార్ హయాంలో గతంలో ఇక్కడే నిర్మించిన చెక్‌డ్యాం నాసిరకం పనులతో ఓపెన్ చేయకముందే 2022లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. దీంతో మానేరులో చుక్క నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం ఇక్కడే కొత్త చెక్ డ్యాం నిర్మించేందుకు నిధులు శాంక్షన్ చేయడంతో త్వరలో పనులు ప్రారంభించనున్నారు. అటు చెక్ డ్యాం. ఇటు మానేరు తీరం వెంబడి కరకట్ట నిర్మిస్తే మానేరు తీరం
పర్యాటక శోభ సంతరించుకోనుంది.