
RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించిన లేటెస్ట్ రూరల్ సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం(Mangalavaaram). పాయల్ రాజ్పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపంచారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు(నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మంగళవారం సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించింది? అజయ్ భూపతి ఈ సినిమాతో హిట్టు కొట్టాడా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ: ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో జరుగుతుంది. ఆ సమయంలో మహాలక్ష్మిపురంలో వరుసగా ఇద్దరు చనిపోతూ ఉంటారు. అది కూడా ఆ ఊరి గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. అంతేకాదు.. ఊళ్ళో గోడలపై వారిపేర్లు రాసి ఉంటాయి. దీంతో వివాహేతర సంబంధాల కారణంగానే వాళ్లు ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్తులంతా నమ్ముతారు కానీ.. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అనుమానపడుతుంది. దాంతో ఆ మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తుంది కానీ.. దానికి ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు. అలా మరో మంగళవారం మరో ఇద్దరు చనిపోతారు. మరి ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఎస్సై మీనా ఛేదించారా? ఊరి గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాతవాసి ఎవరు? ఆ మరణాలకు పాయల్ రాజ్‌పుత్(శైలు) కు ఉన్న లింక్ ఏంటి? అనేది తెలియాలంటే.. మంగళవారం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక రివేంజ్ డ్రామా సినిమా ఇది. అంతర్లీనంగా మహిళలకు సంబంధించిన చిన్న సందేశం కూడా ఉంటుంది. అలా అని ఇదేదో సందేశాత్మక చిత్రం కాదు.. సినిమా మొదలైనప్పటి నుండే ఆడియన్స్ లో ఉత్కంఠ మొదలవుతుంది. హైపర్ సెక్స్ డిజార్డర్ అనే మానసిక, లైంగిక రుగ్మతకు వివాహేతర సంబంధాలు, సస్పెన్స్ ను జోడిస్తూ దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా అద్భుతమైన స్క్రీన్‌ప్లే తో మాయ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి.
మహాలక్ష్మిపురం ఊరు, వరుస మరణాలు, గోడపై ఆక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు కనిపించడం, మంగళవారం వాళ్లు శవాలై కనిపించడం, వాటిని ఛేదించడానికి ఎస్సై మాయ విచారణ.. ఇలా ప్రతీ సీన్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
ఇక ద్వితియార్థం ఎమోషనల్ గా సాగుతుంది. శైలు(పాయల్ రాజ్పుత్) పాత్రను బోల్డ్‌గా చూపిస్తూనే.. ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు దర్శకుడు. ఆడియన్స్ కూడా ఆ పాత్రలో వచ్చే భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారు. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త స్లోగా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. దీంతో మంచి హై ఫీలింగ్ తో థియేటర్ నుండి బయటకు వస్తారు ఆడియన్స్.
నటీనటులు: ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన పాయల్ రాజ్‌పుత్.. మంగళవారం సినిమాతో ఆమెలోని సరికొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. శైలు పాత్రలో ఆమె నటించారు అనే కంటే జీవించారు అనాలి. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించారు పాయల్. ఓపక్క గ్లామర్ పండిస్తూనే.. నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఎస్సై మాయ పాత్రలో నందిని శ్వేత కూడా చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. ఇక అజయ్ ఘోష్, లక్ష్మణ్, ఆర్‌ఎంపీ డాక్టర్‌గా రవీంద్ర విజయ్, జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళైతో పాటు శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డిలు తమ పాత్రల మేరకు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణులు: మంగళవారం సినిమాకు ప్రధాన బలం అనే అజనీష్ లోకనాథ్ సంగీతం అనే చెప్పాలి. తనదైన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచేశాడు. ఇక దాశరథి శివేంద్ర అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒక్కో సీన్, ఒక్కో విజువల్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్, సినిమాను కట్ చేసిన విధానం బాగుంది.
మొత్తంగా చెప్పాలంటే.. మంగళవారం సినిమా ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. సస్పెస్ తోపాటు.. హారర్ ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్ ను మెప్పిస్తాయి.