బషీర్‌బాగ్, వెలుగు: ప్రమాదకర ఇథిలీన్ రైపనర్ పౌడర్ ఉపయోగించి మామిడి కాయలను అశాస్త్రీయ పద్ధతిలో పండించి విక్రయిస్తున్న ముఠా గుట్టును నారాయణగూడ పోలీసులు రట్టు చేశారు. హిమాయత్‌నగర్‌కు చెందిన షేక్ సమీర్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి పెద్దమొత్తంలో మామిడి కాయలను కొనుగోలు చేసి, వాటిని గోదాంలో రసాయనాలతో త్వరగా పండిస్తున్నాడు. అనంతరం వాటిని ప్రజలకు సహజసిద్ధమైన పండ్లంటూ నమ్మించి మోసం చేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారంతో నారాయణగూడ సీఐ సైదేశ్వర్ పర్యవేక్షణలో పోలీసులు ఈ గోదాంపై దాడి చేసి 684 కేజీల మామిడి పండ్లు, 211 ఇథిలీన్ రైపనర్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వర్కర్ ఖాజా పాషాను అదుపులోకి తీసుకోగా, యజమాని షేక్ సమీర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అశాస్త్రీయ పద్ధతిలో పండించిన ఇటువంటి పండ్లు తింటే ఆరోగ్యానికి ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
