మండల స్థాయి ఇన్ ఛార్జ్ లపై ఠాగూర్ అసహనం

మండల స్థాయి ఇన్ ఛార్జ్ లపై ఠాగూర్ అసహనం

మునుగోడు ఉప ఎన్నికను రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకున్నారా..? బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని ప్లాన్ చేస్తుంటే.. కాంగ్రెస్ చతికిలపడుతోందా..? మాణిక్కం ఠాగూర్ సమావేశానికి సీనియర్ నాయకులు ఎందుకు డుమ్మా కొట్టారు..? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది..?

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ కు వచ్చారు. గాంధీభవన్ లో మునుగోడు నియోజకవర్గ వ్యూహరచన కమిటీతో సమావేశమయ్యారు. ఈ భేటీకి AICC కార్యదర్శలు కూడా హాజరయ్యారు. మునుగోడులో ఇతర పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పరిస్థితిపై మాణిక్కం ఠాగూర్ చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు పార్టీ అంతర్గత విషయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 

మధుయాష్కీ డుమ్మా

మండల స్థాయి ఇన్ చార్జుల సమావేశంలో నేతలపై ఠాగూర్ అసహనం వ్యక్తం చేశారు. ఇన్ చార్జుల పని తీరు బాగోలేదని మందలించారు. కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు పార్టీ మారుతున్నా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. మరోవైపు మునుగోడు స్ట్రాటజీ కమిటీ కన్వీనర్ మధుయాష్కీ డుమ్మా కొట్టడంపైనా సీరియస్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ సీనియర్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా మాణిక్కం ఠాగూర్ సమీక్షలను సీరియస్ గా తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. 

మునుగోడు ఉప ఎన్నికను లైట్ తీసుకున్నారా..? 

మరోవైపు సమావేశానికి ఠాగూర్ వచ్చి కూర్చున్నా కొందరు నేతలు ఆలస్యంగా హాజరుకావడం చర్చనీయాంశమైంది. మాణిక్కం ఠాగూర్ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలెవరూ హాజరుకాలేదు. ఇటు కరోనా కారణంగా ఠాగూర్ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షులతో ఆజాది కా గౌరవ్ సమీక్షలో ఠాగూర్ పాల్గొంటారు. రేపు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మరోసారి సమావేశంకానున్నారు. 

కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదు
కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేస్తున్నట్లు కొన్ని ఛానల్స్ లో వస్తున్న వార్తలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మెన్  మహేశ్వర్ రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేశాననే వార్త ఎలా వచ్చిందో తనకు తెలీదన్నారు. ఏఐసీసీ తనకు అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని  విజయవంతంగా నడిపిస్తున్నానని తెలిపారు.