రిలీజ్​ చేసిన 3 రోజుల్లోపే మాకు మేనిఫెస్టోలు ఇవ్వాలి : సీఈవో వికాస్​ రాజ్​

రిలీజ్​ చేసిన 3 రోజుల్లోపే మాకు మేనిఫెస్టోలు ఇవ్వాలి : సీఈవో వికాస్​ రాజ్​

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని అన్ని పార్టీలు మేనిఫెస్టోను రిలీజ్ చేసిన మూడు రోజుల్లోపే తమకు సమర్పించాలని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) వికాస్​రాజ్​ స్పష్టం చేశారు. మేనిఫెస్టోను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రింట్ చేసి మూడు కాపీలను ఇవ్వాలని చెప్పారు. తమ మేనిఫెస్టోలోని పాలసీ విధానాలు, హామీలు ఎన్నికల కోడ్ కు అనుగుణంగానే ఉన్నాయని పార్టీలు ప్రకటన కూడా చేయాలని వెల్లడించారు.  బుధవారం ఆయన బీఆర్కే భవన్​లో  పోలింగ్ ఏర్పాట్లపై  రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వికాస్​రాజ్​మాట్లాడుతూ.. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని లోపలికి అనుమతిస్తామని తెలిపారు.  ఇప్పటి వరకు కొత్త ఓటరు ఎపిక్​ కార్డులు  45.6 లక్షల ప్రింట్​ చేయగా.. 33.43 లక్షలు పోస్టల్​శాఖతో పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ నెల 10 తరువాత ఓటరు సమాచార స్లిప్​ల పంపిణీ ఉంటుందని సీఈవో పేర్కొన్నారు.  

హెల్ప్ డెస్క్ పెట్టండి: కాంగ్రెస్​

కాంగ్రెస్​ పార్టీ ఉపాధ్యక్షులు నిరంజన్ మాట్లాడుతూ..మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సీఈవో వికాస్​ రాజ్ కు​అందించినట్లు  తెలిపారు. ఎన్నికల అంశాల్లోని అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ పెట్టాలని సీఈవోను కోరినట్లు చెప్పారు. నామినేషన్ పత్రాలను అభ్యర్థులు సరిగ్గా నింపకుండా దాఖలు చేస్తే.. తప్పులు సరిచేయకుండానే వాటిని ఆర్వో స్వీకరించినట్లు తెలుస్తోందన్నారు. అఫిడివిట్​లో తప్పులు సరిచేయకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. సీఈవో ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులు ఫోన్ చేసినా.. కింది స్థాయి ఆఫీసర్లు స్పందించడం లేదని ఆరోపించారు.

ఉద్యోగులు తొత్తులుగా పనిచేస్తున్నరు: బీజేపీ

బీజేపీ నేత అంటోని రెడ్డి మాట్లాడుతూ..కొందరు ఉద్యోగులు బీఆర్ఎస్ కు  తొత్తులుగా  పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​ లీడర్లు వాడుతున్న వల్గర్ భాషను కంట్రోల్ చేయాలని సీఈవోను కోరారు. వాళ్ల తీరుపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈసీ చర్యలు తీసుకుంటలేదన్నారు.

రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: బీఆర్​ఎస్​

బీఆర్ఎస్​లీడర్​ సోమా భరత్ మాట్లాడుతూ..​ ఆఫిడవిట్ లో తప్పులు ఉంటే ఆర్వోలు అభ్యర్థులను అప్రమత్తం చేయాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహిళల ముందే బూతులు మాట్లాడుతున్నారని సీఈవోకు చెప్పారు. రేవంత్ రెడ్డి భాషపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డికి భాష తెలియకపోతే తన భార్య, పిల్లల వద్ద నేర్చుకోవాలని సూచించారు. 120 ఏండ్లుగా  కుటుంబ పాలనలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కుటుంబ పాలన అనడమేందన్నారు.