టూరిస్టులకు ఈశాన్య రాష్ట్రాలే ప్రత్యేక ఆకర్షణ: గవర్నర్ తమిళిసై

టూరిస్టులకు ఈశాన్య రాష్ట్రాలే ప్రత్యేక ఆకర్షణ: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ ద్వారా సాంస్కృతిక అనుసంధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పెంపొందిస్తున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు. వివిధ భాషలు, ప్రాంతాలు, సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర, పర్యాటకం, క్రీడలు వంటి వాటిలో అన్ని రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, అనుసంధానం పెరిగేలా ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఆదివారం రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో నిర్వహించిన మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్లో తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, చరిత్ర, వారసత్వంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఈశాన్య రాష్ట్రాలే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని, ఆ రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మేరీ కోమ్, రతన్ థీయామ్, రీమా దేబ్​నాథ్ తదితరులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మలోబికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్​సీయూ ప్రొఫెసర్లతో పాటు త్రిపుర, మణిపూర్, మేఘాలయకు చెందిన పలువురు అతిథులు హాజరయ్యారు.