
వ్యవసాయ పనుల్లో దిట్ట మణిత
బెల్లంపల్లి, వెలుగు: పురుషులకు దీటుగా వ్యవసాయం చేస్తూ తోబుట్టువును డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి.. అన్నింటా తానై కుటుంబాన్ని నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన దరావత్ మణిత.
ట్రాక్టర్ తో దమ్ము కొట్టడం, ఎడ్ల నాగలితో దున్నడం, ఆటో, స్కూటర్ నడపడం, వ్యవసాయ పనులు చేయడం ఇలా మణితకు రాని పనంటూ లేదు. 2 5 ఏళ్ల చిరు ప్రాయంలోనే మగపిల్లాడిలా కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకుని చెల్లిని డిగ్రీ వరకు చదివించి పెళ్లి కూడా చేసింది.
నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన దరావత్ కౌడియానాయక్, కనుకుబాయి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. నలుగురు కొడుకులు, కూతుళ్లకు పెళ్లైపోయింది. ప్రస్తుతం తల్లి దండ్రులతో రెండో కూతురు మణిత ఉంటోంది. వీరికి రెండెకరాల పొలం, రెండెకరాల చేను ఉంది. తండ్రి కౌడియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పొలం పనులు, ఇతర పనులు అన్ని అమ్మతో కలిసి మణితే చూసుకుంటోంది.
నాగలి కట్టి దుక్కి దున్ని విత్తనాలు చల్లడం, నాట్లు పెట్టడం వంటి పనులన్నీ స్వతహాగా చేస్తుంది. వ్యవసాయ పనులు లేని సమయంలో ట్రాక్టర్ , ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తుతుంది. ఇలా ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది. తీరిక లేకుండా ఏ సీజన్ లో ఆ పనులు చేస్తూ తన కుటుంబాన్ని ఏ లోటూ రాకుం డా చూసుకుంటున్న మణితకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
తాను చదువుకోకున్నా…:
కుటుంబ పరిస్థితులు అనుకూలించక మణిత మూడో తరగతిలోనే చదువు మానేసింది. కానీ చెల్లెలు పూర్ణిమను మాత్రం డిగ్రీ వరకు ప్రైవేట్ కళాశాలలో చదివించింది. చెల్లికి ఫీజులు కడుతూనే నిత్యం కుటుంబానికి అవసరమైన డబ్బులను సమకూర్చేది.
భూమిని నమ్ము కున్నా : మణిత
ఎవసం దండుగని ఎవరన్నరు. కష్టపడి పని చేస్తే కాసులు కురిపించచ్చు. భూమిని నమ్ముకున్నోళ్లకు బువ్వ పుడుతుంది. ఒక పంట పొయినా మరో పంట మనల్ని ఆదుకుంటుంది. మహిళలు సైతం పురుషులకు దీటుగా పని చేయగలరని నిరూపించాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నెన్నెల లంబాడీ తండా వాసి మణిత చెబుతోంది.