ఏప్రిల్ 24 నుంచే మంజీరా నది నాలుగో మహా కుంభమేళా

ఏప్రిల్ 24 నుంచే మంజీరా నది నాలుగో  మహా కుంభమేళా

సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు: మంజీరా నది నాలుగో మహా కుంభమేళా ఈనెల 24(సోమవారం) నుంచి మే 5వ తారీఖు వరకు జరుగనుంది. గ‌‌రుడ‌‌ గంగా పుష్కరం సందర్భంగా నిర్వహించే కుంభమేళా  సిద్ధ సర్వస్వతీదేవి  పంచవటి క్షేత్ర సన్నిధిలో 12 రోజల పాటు జరిగే వేడుకలకు ఉత్తర భారతదేశం నుంచి నాగసాధువులు,  దిగంబర సాధుసంతులు, అఘోరాలు తరలిరానున్నారు.  సంగారెడ్డి  జిల్లా న్యాల్‌‌కల్‌‌ మండలం రాఘవపూర్‌‌, హుమ్నపూర్‌‌ గ్రామాల శివారులో జరిగే మంజీరా నది కుంభమేళాకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది భక్తులు రానున్నారు.  

మంజీరా నది తీరంలో..

రాఘవపూర్‌‌, హుమ్నపూర్‌‌ మంజీరా నది తీరంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. గంగామాత అలయంతోపాటు రెండు కిలోమీటర్ల దూరంలో పంచవటి క్షేత్రంలో సిద్ధ సరస్వతీదేవి, షిర్డీ సాయిబాబా, సూర్యభగవాన్‌‌, భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉండగా, ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలను నిర్మించారు. గరుడ గంగ పూర్ణ మంజీరా  పుష్కరాల సందర్భంగా నదికి కుంభమేళా నిర్వహించడం ఇది నాలుగోసారి.  స్థానిక సిద్ధ సర్వస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌‌బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహిస్తున్నారు.  

ఏర్పాట్లు ఇలా..

పుష్కర కుంభమేళాకు వచ్చే భక్తులకు అన్ని సౌలతులు ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌ రావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే​ మాణిక్​ రావు, కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రవాణాకు  ఆర్టీసీ ఆర్‌‌ఎం సుదర్శన్‌‌ నేతృత్వంలో జహీరాబాద్‌‌, నారాయణఖేడ్‌‌ డిపోలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి స్పెషల్​ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ రమణకుమార్‌‌ ఆధ్వర్యంలో జహీరాబాద్‌‌ డీఎస్పీ రఘు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.