
పలు డబ్బింగ్ చిత్రాలతో సౌత్‌లోనూ గుర్తింపును అందుకున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి. ఆయన లీడ్ రోల్‌లో నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ మూవీ హిందీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వంలో జీ స్టూడియోస్, భన్సాలి స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ మూవీని జూన్ 7న తెలుగు, తమిళ భాషల్లో జీ5లో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మనోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము ఎవ్వరమూ ఊహించ లేదు. ఒక మంచి సినిమా చేయాలని భావించాం. రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
కొందరైతే రెండు, మూడు సార్లు చూస్తున్నారు. నేను పోషించిన సోలం అనే లాయర్ పాత్ర కామన్ మ్యాన్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అందరికీ కనెక్ట్ అవుతోంది. ప్రధానంగా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితులను చూపించాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా న్యాయ వ్యవస్థే మూలస్తంభం లాంటిది. అందుకే ఈ చిత్రాన్ని లాయర్స్‌కి, న్యాయ వ్యవస్థకి అంకితం ఇస్తున్నాం. ఈ చిత్రంలో నేను కాకుండా మరో తెలుగు నటుడు ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తే.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాయర్‌గా చేసి మెప్పించారు కనుక మహేష్ బాబు అయితే ఈ పాత్రకు సూట్ అవుతారనిపిస్తోంది’ అని చెప్పారు.