మరాఠాలను కున్బీలుగా ప్రకటించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే

మరాఠాలను కున్బీలుగా ప్రకటించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే
  • తేల్చి చెప్పిన మనోజ్ జరంగే.. దీక్ష కొనసాగుతుందని ప్రకటన
  • రిటైర్డ్​జస్టిస్​ సందీప్ షిండే డెలిగేషన్​తో చర్చలు విఫలం
  • మోసం చేస్తున్నారంటూ.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​పై ఆగ్రహం

ముంబై: మరాఠ్వాడ ప్రాంతంలోని అందరు మరాఠాలను కున్బీలుగా ప్రకటించి రిజర్వేషన్ ఇవ్వాలని మనోజ్ జరంగే పాటిల్ డిమాండ్ చేశాడు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌‌లో నిరాహార దీక్ష చేస్తున్న జరంగేను శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ప్రభుత్వం గతేడాది నియమించిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి సందీప్ షిండే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల డెలిగేషన్ కలిసింది. 13 నెలలుగా పలు గెజిట్​లను స్టడీ చేసిన కమిటీ ఇక రిపోర్టు సమర్పించి, మరాఠాలకు కున్బీ స్టేటస్ ఇచ్చేలా మార్గం సుగమం చేయాలని జరంగే కోరారు.

 కున్బీలు ఓబీసీ కేటగిరీలో ఉన్నారు కనుక, మరాఠాలను కున్బీలుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, చదువుల్లో 10 శాతం రిజర్వేషన్ వస్తుందని చాన్నాళ్లుగా జరంగే డిమాండ్ చేస్తున్నారు. తాజా చర్చలో కూడా హైదరాబాద్, సతారా గెజిట్లను చట్టంగా మార్చి, మరాఠ్వాడ మరాఠాలకు కున్బీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన పట్టుబట్టాడు. అయితే, తనకు అలాంటి రిపోర్టు ఇచ్చే అధికారం లేదని, అది బ్యాక్‌‌వర్డ్ క్లాసెస్ కమిషన్ పని అని సందీప్ షిండే చెప్పారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి.

వర్షంలోనూ ఆందోళనలు ఉధృతం

మరాఠా కోటాపై చర్చలు విఫలమవడంతో జరంగే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ లక్ష్యంగా ‘‘ఇది ప్రభుత్వానికి, రాజ్‌‌భవన్‌‌కు అవమానం. సందీప్ షిండేను పంపి మోసం చేస్తున్నారు’’ అని మండిపడ్డాడు. తన దీక్ష కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరే వరకు విరమించబోనని ప్రకటించాడు. ఫడ్నవీస్ మాత్రం చట్టబద్ధంగా సమస్య పరిష్కరిస్తామని ప్రకటించాడు. గతేడాది సెప్టెంబర్‌‌లో ఏక్‌‌నాథ్ షిండే ప్రభుత్వం షిందే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ, పాత రికార్డులు స్టడీ చేసి మరాఠ్వాడతో పాటు మొత్తం రాష్ట్రానికి కున్బీ సర్టిఫికెట్లు ఇచ్చే విధానం సూచించాలి. మరోవైపు ఆజాద్ మైదాన్‌‌కు వేలాది మంది మరాఠా కోటా మద్దతుదారులు తరలివచ్చారు. ఈ ఆందోళనలు ఆదివారం వరకు మహారాష్ట్ర అంతటా విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.