బషీర్‌బాగ్, వెలుగు: మణుగూరులోని పీకేఓసీ–-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను జెన్‌కోకు కాకుండా సింగరేణికి కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, వేణుమాధవ్‌తో కలిసి వారు మాట్లాడారు.
బొగ్గు వెలికితీతపై కనీస పరిజ్ఞానం, యంత్రాలు లేని జెన్‌కో ఈ వేలంలో పాల్గొనడం సింగరేణికి అన్యాయం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 3న జరగనున్న బొగ్గు బ్లాక్ వేలంలో జెన్‌కో పోటీ నుంచి తప్పుకొని, డీప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాడిచర్ల–1 గనిని జెన్‌కోకు కేటాయించినప్పటికీ, గనుల నిర్వహణ సామర్థ్యం లేక ఏఎంఆర్ సంస్థ ద్వారా బొగ్గు తవ్విస్తున్నారని, ఇందుకు టన్నుకు రూ.3800 జెన్‌కో చెల్లిస్తూ సింగరేణికి రూ.3400కే సప్లై చేస్తోందన్నారు.
ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చుడం ద్వారా వందల కోట్లను దోచుకునేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జెన్‌కో టెండర్‌లో పాల్గొనడం వెనుక ఇందన శాఖలోని కొంత మంది అధికారులు హస్తం ఉందన్నారు. ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చి, వందల కోట్లు దండుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి రాకపోతే 2032 తర్వాత మణుగూరు ప్రాంతంలో సింగరేణి కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో 3,500 మంది శాశ్వత ఉద్యోగులు, 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
