
మణుగూరు, వెలుగు: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని దీని మూలంగా కర్మాగారాల నుంచి వచ్చే పొల్యూషన్ తో రోగాల బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయని మణుగూరు ప్రజలు మండిపడ్డారు. బుధవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మణుగూరు ఓపెన్ కాస్ట్ మైన్ ఎక్స్టెన్షన్ పై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
మండలంలోని రామానుజవరం, విజయనగరం, కొండాయిగూడెం, శ్రీ కృష్ణాపురం గ్రామాలకు చెందిన 356 హెక్టార్ల ప్రైవేట్ భూములతో పాటు ఫారెస్ట్, గవర్నమెంట్ ల్యాండ్స్ కలిపి 1115.91 హెక్టార్ల భూమిని మణుగూరు ఓసీ విస్తరణ కోసం తీసుకోనున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న మండల ప్రజలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితోపాటు సింగరేణి సంస్థ కూడా నిర్వాసితులను మోసం చేసిందని మండిపడ్డారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మణుగూరు ఓసీ ఎక్స్టెన్షన్ గ్రామ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి మనుగడ కోసం మైన్స్ ఎక్స్టెన్షన్ అవసరమని, దాని కోసం ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు త్యాగం చేశారన్నారు. తమకు ఉపాధిని ఇస్తున్న భూములను ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఊళ్లను వదిలేసి సింగరేణికి అప్పగిస్తే అధికారులు మాత్రం వారికి సరైన న్యాయం చేయడంలో విఫలమవుతున్నారరి అసహనం వ్యక్తం చేశారు.
సింగరేణిలో పట్టా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లేనిపక్షంలో ఎకరాకు రూ 30 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజుపేట , విఠల్ రావు నగర్, బాపనకుంట, పీకే 1 సెంటర్ గ్రామాలు నిత్యం సింగరేణి దుమ్ముతోపాటు బ్లాస్టింగ్ ల వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని, ఆ గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి వేణుగోపాల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ బి రవీందర్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, సింగరేణి జీఎం దుర్గం రామచందర్, మణుగూరు డీఎస్పీ వి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.