నాకైనా టికెట్ ఇయ్యండి : మానవతా రాయ్ భార్య సుచరిత

నాకైనా టికెట్ ఇయ్యండి : మానవతా రాయ్ భార్య సుచరిత
  • టికెట్ ఇయ్యకుండా లేట్ చెయ్యడం బాధిస్తున్నదని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: సత్తుపల్లి టికెట్‌‌ను తన భర్తకు కేటాయించకుండా హైకమాండ్ ఆలస్యం చేస్తున్నదని మానవతా రాయ్ భార్య సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. కుల సమీకరణాలే అడ్డు వచ్చి తన భర్తకు టికెట్ ఇవ్వకుంటే.. మాదిగనైన తనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. ‘‘నా భర్త 23 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రజల కోసం పోరాడిన ఆయన ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు. ఇంట్లో కన్నా పోలీస్ స్టేషన్, జైళ్లలోనే ఎక్కువ గడిపాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా లేట్ చేస్తుండడం బాధిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున నా భర్త ప్రజల గొంతుక వినిపించినందుకు నేనూ తీవ్రంగా నష్టపోయాను. టీఎస్​పీఎస్సీ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా నాకు ఐదు గెజిటెడ్ ఉద్యోగాలు రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం అడ్డుకున్నది” అని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా స్టడీ సర్కిల్ గౌరవ డైరెక్టర్​గా కాంట్రాక్ట్​ ఉద్యోగం నుంచీ తనను తప్పించారని, ఎందుకని అడిగితే తన భర్త టీవీ డిబేట్లలో సీఎం కేసీఆర్​ను తిడుతున్నారన్న కారణం చెప్పారని వాపోయారు. సాక్షాత్తూ అప్పటి కలెక్టర్ హరీశ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. కుల సమీకరణాల విషయంలో వేరే ఆలోచన చేసి మాదిగకు ఇవ్వాల్నంటే.. తనకు సీటు కేటాయించాలని కోరారు. తన భర్త త్యాగాలను గుర్తుంచుకుని టికెట్ ఇవ్వాలని, మాల, మాదిగ సామాజికవర్గాల బలం పార్టీకి కలిసి వస్తుందని చెప్పారు.

సుధాకర్ పేరును సూచిస్తున్న పొంగులేటి!

సత్తుపల్లి సీటుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను చెప్పిన వ్యక్తికి ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. కొండూరి సుధాకర్‌‌‌‌కు ఇవ్వాలని తొలి ప్రాధాన్యతగా ఆయన సూచిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. రెండో ప్రాధాన్యతగా మానవతా రాయ్​పేరును సూచిస్తున్నారని అంటున్నారు. మరోవైపు పెండింగ్‌‌లో ఉన్న నాలుగు (చెన్నూరు, తుంగతుర్తి, సత్తుపల్లి, జుక్కల్) ఎస్సీ రిజర్వ్​డ్ నియోజకవర్గాల్లో మాల, మాదిగలకు చెరో రెండు సీట్లు కేటాయించాలని పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సత్తుపల్లిలో మాదిగ నేతను బరిలోకి దింపాలని భావిస్తున్నారట.