ముంచెత్తిన వరద..జలదిగ్బంధంలో ఉత్తర తెలంగాణ

ముంచెత్తిన వరద..జలదిగ్బంధంలో ఉత్తర తెలంగాణ
  • వరంగల్​, సిరిసిల్ల,  కరీంనగర్​, 
  • నిజామాబాద్​లో కాలనీలు మునక
  • కొట్టుకపోయిన వాహనాలు, సామాన్లు
  • వరంగల్​, సిరిసిల్లలో 300 మందిని కాపాడిన రెస్క్యూ టీం
  • వరదలతో తండ్రీకొడుకులు సహా ముగ్గురి మృతి, ముగ్గురు గల్లంతు
  • వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం
  • హనుమకొండ​ జిల్లా నడికుడలో రికార్డు స్థాయిలో 39 సెంటీమీటర్ల వర్షం
  • మరో నాలుగు రోజులు వానలు

వరంగల్​, కరీంనగర్​, నిజామాబాద్​, సిరిసిల్ల.. ఏడ చూసినా వాన, వరద. రోడ్లు చెరువులయ్యాయి. కాలనీలు నీటమునిగాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాయం కోసం దిక్కులు చూస్తున్నారు. కొందరు అతికష్టమ్మీద వరదను దాటుకుంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పిల్లలతో తలదాచుకున్నారు. తమను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ నిజామాబాద్​లో బాధితులు ఆందోళనకు దిగారు. చాలా చోట్ల చెరువులకు, కాలువలకు గండ్లు పడి ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల ముగ్గురు చనిపోయారు. సిరిసిల్లలో మ్యాన్​హోల్​లో జారిపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. 

రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా వానలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన కుండపోత వర్షాలకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఆగమాగమైంది. వరంగల్​, కరీంనగర్​, నిజామాబాద్ ​సిటీలతో పాటు సిరిసిల్ల  జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నాలుగు చోట్ల వరదనీటితో రోడ్లు చెరువులను  తలపించాయి. వరంగల్​లో ఏకంగా 50కిపైగా కాలనీలు నీటమునిగాయి. సిరిసిల్లలో మంగళవారం ఉదయం 7 గంటలకు వరద ముంచెత్తడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం ఇండ్ల నుంచి పరుగులు తీశారు. ఉమ్మడి నిజామాబాద్​, కరీంనగర్​, వరంగల్​ జిల్లాల్లో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. 

నీటమునిగిన వరంగల్ సిటీ

వరంగల్​, హనుమకొండ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నడికుడ మండలంలో 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు గ్రేటర్ వరంగల్ పరిధిలో 50కి పైగా కాలనీలు నీటమునిగాయి. హనుమకొండలోని అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, చైతన్యపురి కాలనీ, జవహర్ కాలనీ, పోచమ్మకుంట, ఇందిరమ్మ కాలనీ, దీన దయాల్ నగర్, వరంగల్ ఎస్సార్ నగర్, మధురా నగర్, సాయి గణేశ్​ కాలనీ, శివనగర్, సంతోషిమాత టెంపుల్ లేన్, కాజీపేట డీజిల్ కాలనీ తదితర ఏరియాలు జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి. నిత్యావసరాలు తడిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  వివిధ ప్రాంతాల్లో నీళ్లలో చిక్కుకున్న దాదాపు 150 మందిని డీఆర్ఎఫ్  సిబ్బంది రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.   

కరీంనగర్​ సిటీలో కాలువల్లా రోడ్లు 

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఇల్లందకుంట మండలం మల్యాలో 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కరీంనగర్  సిటీలోని పద్మానగర్, రేకుర్తి, రాంనగర్, విద్యానగర్, భగత్ నగర్, గణేశ్ నగర్ ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రేకుర్తి 18వ డివిజన్ లోని ఎస్సారెస్పీ కెనాల్  నిండి  ఎస్ ఎస్  హిల్స్ కాలనీలోకి వరద వచ్చింది. శ్రీహరి  నగర్ కాలనీలోకి నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. జమ్మికుంట  హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సుమారు 150 ఇండ్లలోకి వరద నీరు చేరింది. కరెంట్ కట్​చేయడంతో రాత్రంతా పిల్లలతో రోడ్లపై కాలనీవాసులు  జాగారం చేశారు. చొప్పదండి మండలంలోని పందివాగు ఉధృతితో ఆర్నకొండ నుంచి గోపాల్​రావుపేట వైపు రాకపోకలు నిలిచాయి. హుజూరాబాద్​– -హుస్నాబాద్ ​రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మికుంటలో జలమయమైన హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు.   

సిరిసిల్ల ఆగమాగం

భారీ వర్షాలతో  రాజన్నసిరిసిల్ల జిల్లా ఆగమాగమైంది. ప్రధానంగా జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సిరిసిల్ల పట్టణంలోని కార్మికవాడలు, వెంకంపేట, ప్రగతి నగర్, బీవై నగర్, సుందరయ్య నగర్, శాంతినగర్​తోపాటు  పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. కార్లు, బైకులు, ఇతర వెహికల్స్​ కొట్టుకుపోయాయి. ఇండ్లలోకి వరద చేరడంతో జనం పరుగులు తీశారు. ఉదయం 7 గంటలకే వరదనీరు కాలనీలను ముంచెత్తగా, డాబాల మీదికి చేరుకున్నారు. ఉదయం హైదరాబాద్​ నుంచి చేరుకున్న రెస్క్యూ టీమ్స్​ రంగంలోకి దిగి 150 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాయి.  సిరిసిల్ల బైపాస్ రోడ్డుకు గండి పడింది. జిల్లా ఆఫీసర్లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అలర్ట్ చేశారు. ఇటీవల వానలకు జలమయమైన సిరిసిల్ల కలెక్టరేట్ భవనం తాజా వానలకు కూడా నీటమునిగింది. సిరిసిల్ల పాతబస్టాండ్​ దండుగుల లావణ్య అనే గర్భిణి నొప్పులతో ఆస్పత్రి కోసం వచ్చి.. వరద నీటిలో చిక్కుకోగా, ఎస్పీ రాహుల్ హెగ్డే స్వయంగా జేసీబీపై వెళ్లి గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌‌లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.  వరద నీటితో తాము ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనం ధర్నా చేశారు.  మెదక్​లోని సాయి నగర్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగింది. నిర్మల్​ జిల్లాలోని గుండేగాం గ్రామం మునిగిపోయింది. ఇండ్లలో ఉన్న వారు తెప్పలపై బయటకు వచ్చారు.

వాగుల్లో కొట్టుకపోయి ముగ్గురు మృతి

వాగుల్లో కొట్టుకుపోయి ముగ్గురు చనిపోయారు.  జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం నందిపల్లెకు చెందిన తండ్రీకొడుకులు, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం జె గ్రామానికి చెందిన మరొకరు మృతిచెందారు. గౌరవెల్లి వద్ద వాగు దాటుతున్న పోతారం గ్రామానికి చెందిన రంగు కిష్టస్వామి(40) గల్లంతయ్యాడు.  రెండు కిలో మీటర్ల దూరంలో మృత దేహం దొరికింది. నిర్మల్​, కొత్తగూడెం జిల్లాల్లో ఇద్దరు గల్లంతయ్యారు. సిరిసిల్లలో మ్యాన్​హోల్​లో పడి ఒకరు కొట్టుకుపోయారు. జిగిత్యాల జిల్లా నందిపల్లెకు చెందిన ఎక్కాలదేవి చిన్న గంగమల్లు(46) మంగళవారం  తన కొడుకు విష్ణుతో కలిసి బైక్​మీద  పక్క గ్రామం మల్లన్న పేటలో ఫంక్షన్​కు వెళుతుండగా.. చెరువు కట్ట మీద మట్టిరోడ్డులో వారి బైక్​ బురదలో చిక్కుకుంది. బండిని లాగే ప్రయత్నంలో వరదలో కొట్టుకుపోయారు. స్థానికులు, పోలీసులు గాలించగా రెండు గంటల తర్వాత మృతదేహాలు దొరికాయి. లక్ష్మీపూర్​లో ఉండే చిన్న గంగమల్లు అన్నయ్య పెద్ద గంగమల్లు అనారోగ్యంతో మంగళవారం చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని  విషాదం నెలకొంది. జిల్లా కలెక్టర్ రవి ఘటన స్థలాన్ని  సందర్శించి, వరదల్లో మృతి చెందినవారికి రూ. 4 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్  (జి) మండలం లోని టెంబుర్ని  గ్రామానికి చెందిన  గుమ్ముల నరేశ్​  అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెంకు చెందిన తాటి రాంబాబు తన పొలానికి వెళ్లేందుకు మంగళవారం ఉదయం ముర్రేడువాగు దాటుతుండగా వరద పెరిగి కొట్టుకుపోయాడు. ఆయన కోసం స్థానికులు గాలిస్తున్నారు. సిరిసిల్లలో మంగళవారం సాయంత్రం పెరుమండ్ల దేవయ్య(55) అనే వ్యక్తి మ్యాన్ హోల్​లో పడి కొట్టుకుపోయాడు.