ఎమ్మెల్యే వైపు పోలేక ..ఇప్పుడు ఏం చేద్దాం?

ఎమ్మెల్యే వైపు పోలేక ..ఇప్పుడు ఏం చేద్దాం?

మెదక్, వెలుగు: అనుకున్నదొక్కటి..  అయ్యింది ఇంకొక్కటి కావడంతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లీడర్లు పరేషాన్​ అవుతున్నారు.  తమకు తగిన గుర్తింపు లభించడం లేదని కొందరు, పదవులు దక్కలేదని మరికొందరు, అభివృద్ధి పనులకు, ఇతర వ్యక్తిగత పనులకు సహకారం లభించలేదని ఇంకొందరు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిపై అసంతృప్తితో  గతంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గంలో,  మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గంలో చేరారు.   అయితే ఆ నేతలకు టికెట్​ రాకపోవడంతో  ఇప్పుడు ఏం చేద్దామనే ఆలోచనలో పడ్డారు. పాపన్నపేట ఎంపీపీ చందన భర్త, ఆ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి చాలా రోజులుగా ఎమ్మెల్యేకు దూరమై ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారు.

చిన్నశంకరంపేట మండలానికి చెందిన రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్ సైతం ఎమ్మెల్సీ  వర్గంలో చేరారు. హవేలీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డితోపాటు, ఆ మండలానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు, రామాయంపేట, నిజాంపేట  మండలాలకు చెందిన పలువురు లీడర్లు ఎమ్మెల్సీకి సపోర్ గా ఉంటున్నారు. గత ఫిబ్రవరిలో మైనంపల్లి రోహిత్ ఎంట్రీ ఇచ్చాక మండల కేంద్రమైన చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఇతర పలువురు నాయకులు, మెదక్ పట్టణానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు మద్దతిస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ రాదనుకొని సుభాష్ రెడ్డి, రోహిత్ వెన్నంటి ఉంటూ వారు నిర్వహించే కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అంచనాలు తలకిందులు

బీఆర్​ఎస్​ హై కమాండ్ వారి అంచనాలు తలకిందులు చేస్తూ మళ్లీ పద్మా దేవేందర్ రెడ్డికే మెదక్​ టికెట్ ఇవ్వడంతో  వర్గాలు మారిన నేతలంతా ఖంగుతిన్నారు. ఇంతకాలంగా వ్యతిరేకవర్గంలో ఉన్నందున మళ్లీ ఎమ్మెల్యే వైపు వెళ్లలేక, ఇటు తాము నమ్ముకున్న నాయకుడికి టికెట్ రాకపోవడం, వారి రాజకీయ నిర్ణయం వెల్లడి కాకపోవడంతో ఎటూ పాలుపోక తలపట్టుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే అందరి సహకారం అవసరమని భావిస్తున్న ఎమ్మెల్యే ప్రత్యేక శిబిరాలతో ప్రయత్నాలు చేస్తూ వారిని తన వైపు తిప్పుకునేలా ప్లాన్​ చేస్తున్నారు.