జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు

జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు 50 గేట్లు ఓపెన్ చేసి 11 లక్షల క్యూసెక్కుల వరదను రిలీజ్ చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఒడ్డు నుంచి 500 మీటర్లకు పైగా వరద కమ్మేసింది. గౌతమేశ్వరాలయం, మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) నీట మునిగాయి. ఎంసీహెచ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొచ్చాయి. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో మంగళవారం రాత్రే పేషెంట్లను పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్​కు షిఫ్ట్ చేశారు. లేకుంటే బాలింతలు, గర్భిణులు, పసిపిల్లల పరిస్థితి ఆగమయ్యేది. పట్టణంలోని రాళ్లవాగు ముందెన్నడూ లేనంతగా ఉప్పొంగింది. ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీ, రాళ్లపేటను తెల్లవారుజామున వరద చుట్టుముట్టింది. రాంనగర్​లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు సెకండ్ ఫ్లోర్ వరకు మునిగాయి. నిత్యాసరాలతో పాటు బెడ్లు, సోఫాలు, ఫ్రిజ్​లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, దుకాణాల్లోని విలువైన సామాన్లు నీటి పాలయ్యాయి. కొంతమంది రాత్రే బంధువుల ఇండ్లకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వరదలో చిక్కుకున్న కుటుంబాలను రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు రక్షించారు. సింగరేణి రెస్క్యూ టీం సాయంతో తెప్పలపై బయటకు తీసుకొచ్చారు. పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం, షాదీఖానా, వైశ్యభవన్​లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు. సాయంత్రం వరకు అటు గోదావరి, ఇటు రాళ్లవాగు మరింత ఉప్పొంగాయి. రాత్రి వరకు ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, కలెక్టర్ భారతి హోళికేరి, డీసీపీ అఖిల్ మహాజన్ కాలనీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితులకు నిత్యావసర సరుకులు, ఆహారం అందజేశారు. 

గోదావరి తీర గ్రామాల్లో అలర్ట్ 

జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని గోదావరి తీర గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. వరద చుట్టుముట్టడంతో కోటపల్లి మండలం పాత దేవులవాడ, కొల్లూరు, రావులపల్లె, దేవులవాడ గ్రామాలను ఖాళీ చేయించారు. గ్రామస్తులను పారుపెల్లి, రాంపూర్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలించారు. ముంపు ముంగిట ఉన్న అర్జునగుట్ట, రాపన్పల్లి, లక్ష్మీపూర్, చెన్నూర్ మండలం సుందరశాల, నర్సక్కపేట గ్రామాల్లోని పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్సెట్టిపేట మండలం పోతపల్లి గ్రామాన్ని ఓ పక్క గోదావరి, మరో పక్క అంకత్​పల్లి వాగు వరద చుట్టేయడంతో గ్రామస్తులను సూరారంలోని రైతు వేదికకు తరలించారు. జైపూర్ మండలం వేలాల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లోని పలు ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలను  పోలీసులు వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జన్నారం మండలం రోటిగూడ, సుందరయ్యకాలనీ, పుట్టిగూడ గ్రామాల్లోని కుటుంబాలను, ఆశ్రమ స్కూల్​స్టూడెంట్లను జన్నారంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోకి షిఫ్ట్ చేశారు. చెన్నూర్ బతుకమ్మ వాగు బ్రిడ్జి కోతకు గురికావడంతో ఫోర్ వీలర్ల రాకపోకలు బంద్ చేశారు. కోటపల్లి మండలం లింగన్నపేట, ఏదులబంధం మధ్య కల్వర్టు, రోడ్డు తెగిపోయి 9 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. జైపూర్ మండలం టేకుమట్ల బ్రిడ్జి, పెగడపల్లి ఈదులవాగు ఉప్పొంగి అటువైపు నాలుగు రోజుల నుంచి రాకపోకలు  నిలిచిపోయాయి. రసూల్​పల్లి వాగు టెంపరరీ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహించింది. మంచిర్యాల, జైపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.