
హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వచ్చిన పలువురు ఆయన కుటంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. కాగా పోస్టు కోవిడ్ సమస్యలతో గుండె పోటు రావడంతో ఇవాళ ఉదయం కృష్ణంరాజు కన్నుమూశారు.
కృష్ణంరాజును కోల్పోవడం బాధగా ఉంది: మాజీ సీఎం చంద్రబాబు
రెబల్ స్టార్ కృష్ణంరాజు ని కోల్పోవడం బాధగా ఉందని, చరిత్రలో ఆయనకో పేజీ ఉంటుందని చెప్పారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి కృష్ణంరాజు అని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణంరాజు వారసత్వాన్ని ప్రభాస్ కొనసాగిస్తున్నారని, ప్రభాస్ ధైర్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు.
కృష్ణంరాజు మరణం పార్టీకి తీరని లోటు: బండి సంజయ్
కృష్ణంరాజు మరణం బీజేపీకి తీరని లోటని బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతిమ తీర్పు చూశాక ఒక్కసారైనా కృష్ణంరాజును కలవాలనుకున్నానని, అయితే తన కల నెరవేరిందన్నారు. తన రాజకీయ పోరాటాలకు కృష్ణంరాజు ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ వచ్చారని, విలువైన సలహాలు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన లోటును ప్రభాస్ తీరుస్తారని, ప్రభాస్ కు తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.
కృష్ణంరాజు మరణ వార్త కలచివేసింది: మంత్రి కేటీఆర్
కృష్ణంరాజు మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణంరాజు చెరగని ముద్రవేశారని, ఆయన ఇక లేరు అంటే నమ్మబుద్ధికావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ కనపడినా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కృష్ణంరాజు అందరిని ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
కృష్ణంరాజు మృతితో సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది
సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరనిలోటని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందన్నారు.
నా కొత్తింటికి పిలుద్దామనుకున్నా.. ఇంతలోనే
కృష్ణం రాజు భౌతిక కాయనికి హీరో అల్లు అర్జున్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ కృష్ణంరాజు ఇంటి దగ్గర్లో నే నేను కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నా.. నా కొత్త ఇంటికి కృష్ణంరాజును పిలవాలని అనుకున్నాను...కానీ ఇంత లొనే ఇలా జరుగుతుందని అనుకోలేదు అన్నారు. కృష్ణంరాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అల్లు అర్జున్ చెప్పారు.