పక్కా ప్లాన్​తో ముందుకు.. చేరికలపై స్పెషల్​ ఫోకస్

పక్కా ప్లాన్​తో ముందుకు.. చేరికలపై స్పెషల్​ ఫోకస్

మెదక్/సంగారెడ్డి/ సిద్దిపేట, వెలుగు :  తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్​తో ముందుకెళ్తోంది. అదులోభాగంగా మెతుకుసీమలో చేరికలపై స్పెషల్​ ఫోకస్​పెట్టింది. ఇప్పటికే చేరికల కమిటీ చైర్మన్​, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ నేతృత్వంలోని కమిటీ టీఆర్​ఎస్, కాంగ్రెస్​ పార్టీలోని అసంతృప్త లీడర్లతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నా, పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు, గౌరవం, పదవులు దక్కక నారాజ్​ లో ఉన్న టీఆర్​ఎస్​ లీడర్లు, పార్టీలో ఆశవాహులు ఎక్కువ మంది ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం రాదని భావిస్తున్న కాంగ్రెస్​ నాయకులు ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రీన్​ సిగ్నల్​ఇచ్చిన వారిని బీజేపీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీనికి నర్సాపూర్​ పట్టణం వేదిక కానున్నది. ఈనెల 9న నర్సాపూర్​లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​చుగ్, కేంద్రం మంత్రి భూపేంద్ర యాదవ్, పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​, చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్  ఎమ్మెల్యే ఈటల రాజేందర్  హాజరుకానున్నారు. 

జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... 

మెదక్​లో టీఆర్ఎస్​ పార్టీ ఉమ్మడి మెదక్​ జిల్లా మాజీ అధ్యక్షుడు, నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మన్​ఎర్రగొళ్ల మురళీ యాదవ్ ​బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్​ తరపున మున్సిపల్​ చైర్మన్​ గా ఎన్నికైన మురళీ యాదవ్ కొద్ది రోజుల కిందట బీసీలకు ప్రభుత్వంలో, పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని సీఎంపై, పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మురళీయాదవ్​ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు, అధికార పార్టీకి చెందిన ఇద్దరు మున్సిపల్​ కౌన్సిలర్లు, నర్సాపూర్, శివ్వంపేట మండలాలకు చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి మండలాలకు చెందిన మరికొందరు ఇతర పార్టీ నేతలతో, ప్రజాప్రతినిధులతో బీజేపీ లీడర్లు సంప్రదింపులు జరుపుతున్నారు.  

సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఈటలతో టచ్ లో ఉన్నప్పటికీ వారు పార్టీ మారేందుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ నేతలు కొందరు బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు. పటాన్​ చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ సీనియర్​నాయకుడు, మాజీ కార్పొరేటర్​ శంకర్​యాదవ్, సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మున్సిపల్ ​మాజీ చైర్మన్ ​సత్యనారాయణ బీజేపీలో చేరేందుకు  రెడీగా ఉన్నట్టు  అనుచరులు ప్రచారం చేస్తున్నారు. జహీరాబాద్, అందోల్​ అసెంబ్లీ సెగ్మెంట్ల కు చెందిన పలువురు కాంగ్రెస్​ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్​ఎస్ లీడర్లు నర్సాపూర్​లోని సభలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గజ్వేల్ ​మున్సిపల్​ మాజీ చైర్మన్​ గాడిపల్లి భాస్కర్ తో పాటు మరో నలుగురు ముఖ్య నేతలు బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఈ చేరిక విషయం ముందుగా లీకైతే అధికార పార్టీ నేతలు అడ్డుకునే అవకాశం ఉందని భావించిన బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్​తో గజ్వేల్​కు చెందిన పలువురు అధికార పార్టీ లీడర్లు పలుమార్లు సంప్రదింపులు జరపగా, ఇప్పుడు ఎవరెవరు బీజేపీలో చేరుతారనే విషయంలో సస్పెన్స్​ కొనసాగుతోంది.