డాలర్ శేషాద్రి ప్రస్థానం

డాలర్ శేషాద్రి ప్రస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం OSD డాలర్ శేషాద్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. అక్కడే గుండెపోటుతో చనిపోయారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ ఆయన సేవలు అవసరమని భావించి OSDగా కొనసాగిస్తోంది టీటీడీ. చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో తరించారు డాలర్ శేషాద్రి. ఆంధ్రా మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి ఆయన డెడ్ బాడీని తరలించారు. అక్కడ అంబార్క్ మెంట్ చేసి తిరుపతి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. 1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటి నుంచి ఒఎస్డీగా కొనసాగుతున్నారు. శేషాద్రికి భార్య, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 

గుమాస్తా నుంచి ఓఎస్డీ స్థాయికి..

టీటీడీలో డాలర్ శేషాద్రికి ఎంతో పేరు ఉంది. సాధారణ గుమాస్తాగా చేరి దేవస్థానం OSD స్థాయికి ఎదిగారు. అయితే ప్రశంసలతో పాటు ఆయనపై విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శలు ఎన్ని వచ్చినా.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాలర్ శేషాద్రిని పక్కన పెట్టలేదు. 50 ఏళ్ల నుంచి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, ఉత్సవాలు, కైంకర్యాలు, సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై శేషాద్రికి పట్టు ఉంది. అందుకే రిటైర్మెంట్ అయి పదేళ్లకు పైనే అయినప్పటికీ ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు.

డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది?

పీ శేషాద్రి అంటే అసలు ఎవరికీ తెలియదే. అదే డాలర్ శేషాద్రి అంటే సులువుగా గుర్తుపడతారు. ఆయనకా పేరు రావడానికి రెండు కారణాలున్నాయి. నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్ ను ధరించడం వల్లే ఆయనకు డాలర్ అనే బిరుదు వచ్చింది. ఆత్మీయులు, సన్నిహితులు ఆయనను డాలర్ మామ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక శ్రీవారి ఆలయంలో స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్ ను తయారు చేసి విక్రయించేవారు. అది కూడా డాలర్ చేతుల మీదుగానే కొనసాగేది. అప్పటి నుంచి పీ శేషాద్రికి బదులుగా డాలర్ శేషాద్రిగానే ఆయన ప్రాచుర్యం పొందారు. 

డాలర్ల కుంభకోణం

2006లో డాల్లర్ శేషాద్రి పై బంగారు డాల్లర్ల మిస్సింగ్ అభియోగాలు వచ్చాయి. . దాదాపు 305 డాలర్లు మాయమవడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ బోర్డు.. శేషాద్రితో పాటు మరో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనలో విచారణకూ ఆదేశించింది. అయితే, కిందిస్థాయి ఉద్యోగులపాత్రే ఇందులో ఉందంటూ.. పైస్థాయిలో ఉన్న శేషాద్రికి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన మళ్లీ విధుల్లో చేరిపోయారు. 2009లో అప్పటి ఈవో కృష్ణారావు ఆదేశాల మేరకు 9 నెలలు విధులకు దూరమైన శేషాద్రి.. తిరిగి కోర్టు ఆదేశాలతో విధుల్లో చేరారు. మొత్తం సర్వీసులో 15 నెలల కాలం మినహాయిస్తే.. పూర్తిగా శ్రీవారి సన్నిధిలో డాలర్ శేషాద్రి విధుల నిర్వర్తించారు. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు అందరికీ ఆయన సుపరిచితుడిగా ఉన్నారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణతో శేషాద్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రీసెంట్ గా తిరుమల పర్యటన సందర్భంగా స్వయంగా శేషాద్రి ఇంటికి రమణ వెళ్లారు. 

వీఐపీ దర్శనాలకు అన్నీ తానై..

తిరుమలకు ఎంతో మంది వీఐపీలు, వీవీఐపీలు వెంకన్నను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇలా వచ్చిన వీఐపీలు ప్రత్యేకించి డాలర్ శేషాద్రి ఆశీస్సులు పొందేందుకు ఆసక్తి చూపుతారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రముఖులకు శేషాద్రి చేతుల మీదుగానే రాచమర్యాదలు జరుగుతుండేవి. ఆయనకు చాలా మంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దగ్గర నుంచి నేటి మోడీ వరకు.. అంబానీలు, అదానీలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రపతులు ఇలా వీఐపీలు, వీవీఐపీలు ఎవరొచ్చినా డాలర్ శేషాద్రి దగ్గరుండి దర్శనాలు చేయించేవారు.