కాంగ్రెస్​లో ఆగని ఆందోళనలు..

కాంగ్రెస్​లో ఆగని ఆందోళనలు..
  • కాంగ్రెస్​లో ఆగని ఆందోళనలు
  • గాంధీ భవన్​తో పాటు రేవంత్​ ఇంటి ముట్టడికి యత్నం
  • భారీగా పోలీసుల మోహరింపు.. పలువురి అరెస్ట్
  • గాంధీభవన్ ​గేట్లకు తాళాలు.. బారికేడ్లు ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ మూడో లిస్టులో టికెట్ దక్కని పలువురు సీనియర్​ లీడర్లు, వారి అనుచరులు మంగళవారం ఆందోళనకు దిగారు. గాంధీ భవన్​తో పాటు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గాంధీ భవన్​ గేట్లకు తాళాలు వేశారు. లోపలి వాళ్లు బయటకు.. బయటి వాళ్లు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా మెయిన్​ గేట్లను బంద్​ చేశారు. ఎవరూ రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు. చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. 

మరోవైపు టికెట్​ రాకపోవడంతో పలువురు సీనియర్​ లీడర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను చెప్పినోళ్లకు టికెట్​ దక్కలేదని దామోదర రాజనర్సింహ, పార్టీకి ఎంత చేసినా న్యాయం జరగలేదని బెల్లయ్య నాయక్, మానవతారాయ్​ పార్టీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్​లోని గాంధీ విగ్రహం ముందు బెల్లయ్య నాయక్​ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పటాన్​చెరు టికెట్​ఆశించిన కాటా శ్రీనివాస్​ గౌడ్​ అనుచరులు మంగళవారం రేవంత్​ ఇంటిని ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. మరికొందరు గాంధీ భవన్​ మెట్లపై ఆందోళన చేయగా, వారిని అరెస్ట్ చేసి, స్టేషన్​కు తరలించారు.

కొడంగల్​ టికెట్​ ఇయ్యాలంటున్న బెల్లయ్య 

మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్​ నియోజకవర్గాల నుంచి బెల్లయ్య నాయక్​ అప్లికేషన్​ పెట్టుకోగా.. టికెట్​ దక్కలేదు. ఈ నేపథ్యంలో కొడంగల్​ టికెట్​ ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేస్తున్నారు. రేవంత్​ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి.. లంబాడాలు ఎక్కువుండే కొడంగల్​ నియోజకవర్గాన్ని తనకు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారు. ఇటు దామోదర రాజనర్సింహ కూడా టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. పటాన్​చెరు నుంచి కాటా శ్రీనివాస్​ గౌడ్, నర్సాపూర్​ నుంచి గాలి అనిల్​ కుమార్, నారాయణ్​ఖేడ్​ నుంచి సంజీవ్​ రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి సుభాష్​​ రెడ్డికి టికెట్లు ఇవ్వాలని దామోదర విజ్ఞప్తి చేయగా.. ఏ ఒక్కరికీ అధిష్టానం టికెట్​ కేటాయించలేదు. దీంతో పార్టీ పెద్దలపై దామోదర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. 

రెబెల్​గా పోటీ చేసే యోచనలో మానవతా రాయ్​

ఓయూ జేఏసీ నేత కోటూరి మానవతా రాయ్​ సత్తుపల్లి టికెట్​ఆశించారు. అయితే, ఆయనకు కాకుండా మట్టా రాగమయికి టికెట్​ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన భార్యకైనా టికెట్​ ఇవ్వాలని అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేసినా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన రెబల్​గా బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఆయన భార్య కూడా సత్తుపల్లి నుంచి నామినేషన్​ వేయాలని భావిస్తున్నారు. దీంతో పీసీసీ జనరల్​ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రేవంత్​ రెడ్డికి లేఖ రాశారు. 

చేవెళ్ల అభ్యర్థికి లైన్​ క్లియర్​?

బీఫాం పెండింగ్​లో ఉన్న చేవెళ్ల నియోజకవర్గ అభ్యర్థికి లైన్​ క్లియర్​ అయింది. ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థి భీం భరత్​కే మంగళవారం పార్టీ నేతలు బీఫాంను అందజేశారు. నామినేషన్​, అఫిడవిట్​లలో కేసులకు సంబంధించి కొన్ని టెక్నికల్​ సమస్యలు ఉండడం వల్లే భీం భరత్​ టికెట్​ను పెండింగ్​లో పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానిపై పూర్తిగా చర్చించిన తర్వాత ఆయనకు బీఫాంను జారీ చేశారు.