భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌లో మావోయిస్టులకు చెందిన డంప్‌ను గుర్తించారు. ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీసులతో పాటు డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కవరగట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో దాచిన డంప్‌లను గుర్తించారు.
రూ.65.52లక్షలతో పాటు ఎల్‌ఎంజీ, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, కార్బైన్ రైఫిల్, ఐదు 303 రైఫిల్స్, 315 రైఫిల్, ఐదు సింగిల్ షాట్ గన్స్, నాలుగు 12 బోర్ తుపాకులు 4, ఏడు బీజీఎల్ లాంచర్లు 7, ఒక 8ఎంఎం పిస్టల్, వింటేజ్ బోల్ట్ యాక్షన్, ఎల్‌ఎంజీ మేగజైన్, ఎల్‌ఎంజీ బారల్, ఎస్‌ఎల్‌ఆర్ మేగజైన్లు, 303 రైఫిల్ మేగజైన్లు, ఏకె-47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, 315 రైఫిల్, పిస్టల్, 12 బోర్ జిందా కార్తూస్‌లు, 84 బీజీఎల్ షెల్స్, మందుపాతరలు తయారు చేసే పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు భారీ సంఖ్యలో దొరికాయి. వివిధ డంపుల్లో ఇప్పటివరకు మొత్తం రూ.7.28 కోట్లు, రూ.12.80 కోట్ల విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
