మావోయిస్టు నేత పసునూరి నరహరి లొంగుబాటు

మావోయిస్టు నేత పసునూరి నరహరి లొంగుబాటు
  • జార్ఖండ్‌‌‌‌ లో టెక్నికల్‌‌‌‌ వింగ్‌‌‌‌ బాధ్యతలు
  • 45 ఏండ్ల అజ్ఞాతం వీడిన నరహరి
  • భార్య పూనంతో కలిసి లొంగిపోయిన నరహరి
  • త్వరలో మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు 

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. దేవ్‌‌‌‌జీ సహా కీలక నేతలు, పార్టీ కేడర్ ఇప్పటికే లొంగిపోగా.. తాజాగా మావోయిస్టు సెంట్రల్‌‌‌‌ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్(55) ఆయన భార్య పునం అలియాస్‌‌‌‌ శోభ రాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి.. ప్రస్తుతం జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 45 ఏండ్లుగా అజ్ఞాత జీవితం గడిపారు. కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఝార్ఖండ్‌‌‌‌లోని సరండా ఫారెస్ట్‌‌‌‌లో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం భద్రతా బలగాలు కూంబింగ్ తీవ్రతరం చేయడంతో నరహరి లొంగిపోయేందుకు తెలంగాణ ఎస్‌‌‌‌ఐబీని సంప్రదించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తన భార్య పూనంతో కలిసి లొంగిపోయారు. వీరి సరెండర్‌‌‌‌ను రెండు, మూడు రోజుల్లో పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

మిగిలింది ముగ్గురే, గణపతి జాడ ఎక్కడో..? 

తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌‌‌‌రావు అలియాస్ గణపతి, ఆయన భార్య జోడే రత్నాబాయి అలియాస్‌‌‌‌ సుజాత, వార్త శేఖర్ అలియాస్‌‌‌‌ మంగ్తు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వీరిలో గణపతి ఆరోగ్యం క్షీణించినట్లు పోలీసులు చెప్తున్నారు. కానీ, ఎక్కడున్నాడనే జాడ మాత్రం కనిపెట్టలేక పోయారని సమాచారం. ఈ క్రమంలోనే గణపతి భార్య జోడే రత్నాభాయి, వార్త శేఖర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సమాచారం లభించలేదని తెలిసింది. దీంతో రాష్ట్రానికి చెందిన మావోయిస్టుల్లో కేవలం ఈ ముగ్గురు మాత్రమే అజ్ఞాతంలో మిగిలిపోయారు.

కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి1980లో నక్సలైట్ల విధానాలకు ఆకర్షితులయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ అలియాస్ బక్కన్నతో ప్రోత్సాహంతో మావోయిస్టు ఉద్యమంలోకి ప్రవేశించాడు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూనే కూలీల రేట్లను పెంచేలా పోరాటం చేశాడు. 1996 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.