పోలీసుల అదుపులో మావోయిస్ట్‌‌ ఆశన్న భార్య !

పోలీసుల అదుపులో మావోయిస్ట్‌‌ ఆశన్న భార్య !
  • హఫీజ్‌‌పేట నుంచి తీసుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు
  • శ్రీవిద్యఅరెస్ట్‌‌ను ధ్రువీకరించని పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు : మావోయిస్ట్‌‌ నేత తక్కలపెల్లి వాసుదేవరావు అలియాస్‌‌ ఆశన్న భార్య నార్ల శ్రీవిద్యను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. మేడ్చల్‌‌ మల్కాజ్‌‌గిరి జిల్లా హఫీజ్‌‌పేటలో ఉంటున్న ఆమె ఇంటికి ఆయుధాలు కలిగిన కొందరు వ్యక్తులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. ఈ మేరకు కుటుంబసభ్యులు మానవ హక్కుల వేదికకు సమాచారం ఇచ్చారు. మఫ్టీలో వచ్చిన వారు పోలీసులా ? ఇతర వ్యక్తులా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 అయితే పోలీసులే శ్రీవిద్యను అరెస్ట్‌‌ చేశారంటూ మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌‌.తిరుపతయ్య, తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు జీవన్‌‌కుమార్‌‌ ఓ ప్రకటనలో ఆరోపించారు. శ్రీవిద్యను తీసుకెళ్లిన వారు పోలీసులైతే చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచాలని, లేదంటే ఆమెను వెతికి పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్‌‌రెడ్డి జోక్యం చేసుకొని శ్రీవిద్యను కాపాడాలని పీస్‌‌ డైలాగ్‌‌ కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌‌ చంద్రకుమార్‌‌ కోరారు. అయితే శ్రీవిద్య అరెస్ట్‌‌ను పోలీసులు ఇంతవరకూ ధ్రువీకరించలేదు.