
- మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌కు నివాళి
భద్రాచలం, వెలుగు: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాల కండ్లను గప్పి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జులై 28నుంచి ఈనెల 3 వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ అధికార ప్రతినిధి గంగాల్శనివారం ఈ వివరాలు వెల్లడించారు.. తెలంగాణ-–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్-సుక్మా జిల్లాల పరిధిలోని చిన ఊట్లపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో 5వేల మంది ఆదివాసీలతో 2 కి.మీల ర్యాలీతో మావోయిస్టులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
మూడంచెల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇటీవల మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్ స్మారక స్తూపం వద్ద నివాళి అర్పించారు. వారోత్సవాల నేపథ్యంలో దండకారణ్యంలో పోలీసు బలగాలు ఆపరేషన్ మాన్సూన్ పేరుతో కూంబింగ్‌లు నిర్వహించాయి. సరిహద్దున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ పోలీసులు అలర్ట్ అయ్యారు. అయినా మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో భారీగా బహిరంగ సభ పెట్టి, ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళి అర్పించింది.