మావోయిస్టు స్టేట్ ప్రెస్ ఇన్ చార్జి లొంగుబాటు

మావోయిస్టు స్టేట్ ప్రెస్ ఇన్ చార్జి లొంగుబాటు

కరీంనగర్, వెలుగు: సీపీఐ (మావోయిస్టు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రెస్ ఇన్ చార్జీగా పని చేస్తున్న నేరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు ఎదుట లొంగిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన జ్యోతి 2004లో సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంటర్ సెకండియర్ చదివే క్రమంలో విప్లవ గీతాలకు ఆకర్షితురాలయ్యారు. అదే జిల్లా వీర్నపల్లి మండలంలోని అడవి పదిరలోని తన అక్క దగ్గరికి వెళ్లిన సందర్భంలో మావోయిస్టులు నిర్వహించిన మీటింగ్ లో పాల్గొని, అప్పటి దళ కమాండర్ రఘు ద్వారా దళంలోకి వెళ్లారు. అప్పటి మావోయిస్టు డీసీఎం బాబన్న, జిల్లా కార్యదర్శి రమేశ్​దళాలతో కలిసి పని చేశారు.

కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట, చందుర్తి, నిజామాబాద్ జిల్లాల దళాలతో పని చేస్తున్న క్రమంలోనే 2005 మార్చి 7న మానాల ఎన్ కౌంటర్ జరగ్గా ఇందులో జ్యోతి  చనిపోయిందని వార్తలొచ్చాయి. కానీ,అది నిజం కాదని తేలడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  తర్వాత  జ్యోతి ఆదిలాబాద్ జిల్లా మంగి దళంలోకి వెళ్లారు. 2011లో ఆదిలాబాద్ జిల్లాలోని కర్రిగుట్టలో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత జంపన్నతో కలిసి ఒడిశాకు వెళ్లి, ప్రెస్ కమిటీ మెంబర్ గా పని చేశారు. కొంతకాలంగా తెలంగాణ ప్రెస్ కమిటీ ఇన్ చార్జీగా, జిల్లా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ విధానాలు నచ్చకపోవడం, పోలీసులు 'ఆపరేషన్ చేయూత' ద్వారా మావోయిస్టు కుటుంబాలకు సాయం చేయడం నచ్చి జనజీవన స్రవంతిలో కలిసినట్లు సీపీ సుబ్బారాయుడు తెలిపారు. జ్యోతిపై రూ.5 లక్షల రివార్డు ఉందని, ఆ మొత్తం ఆమెకు ఇవ్వడంతోపాటు ప్రభుత్వం తరఫున పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పిస్తామన్నారు. 

ఎన్​కౌంటర్​లో మావోయిస్టు మృతి

భద్రాచలం : చత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లా కేర్లాపాల్ పీఎస్​ పరిధిలో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ మావోయిస్టు చనిపోయారు. సిమేల్​-గోంగుడ గుట్టల్లో భారీ ఎత్తున మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో డీఆర్​జీ, ఎస్టీఎఫ్​, సీఆర్​పీఎఫ్​ , లోకల్ పోలీసులు కూంబింగ్​కు వెళ్లాయి. తిరిగి వస్తున్న బలగాలపై సిర్​సేటీ గ్రామ సమీపంలోని కోడెల్పారా అడవుల్లో మావోయిస్టులు దాడికి దిగారు.

తేరుకున్న బలగాలు ప్రతిఘటించడంతో ఎన్​కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు పారిపోయారు. పలువురు గాయపడి  పారిపోగా, ఘటనా స్థలంలో ఓ మావోయిస్టు మృతదేహం దొరికింది. వాకీటాకీలు, మందుపాతరలకు ఉపయోగించే పరికరాలు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తుపాకీ, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందని  బస్తర్​ ఐజీ సుందర్ ​దాస్​ చెప్పారు.