మావోయిస్టుల లొంగుబాట..60మందితో మల్లోజుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాట..60మందితో మల్లోజుల లొంగుబాటు
  • ఒకే రోజు ఇటు మహారాష్ట్రలో, అటు చత్తీస్​గఢ్​లో భారీగా సరెండర్​
  • మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట 60 మందితో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్
  • 54 ఆయుధాలు అప్పగింత.. మల్లోజులకు రూ. 6 కోట్ల రివార్డు ఇచ్చిన ఫడ్నవీస్చత్తీస్​గఢ్​లోని సుక్మాలో 
  • 27 మంది, కొండగావ్​లో మరొకరు లొంగుబాటు
  • జనంలో కలిసేందుకు కాంకేర్​ జిల్లాలో 100 మంది రెడీ
  • నేడు లొంగిపోనున్న 
  • మరో అగ్రనేత ఆశన్న..
  • ఆయన వెంట 70 మంది కూడా!
  • ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా 
  • లక్ష్మీదేవిపేట.. ఐపీఎస్ 
  • ఉమేశ్​ చంద్ర, మాధవరెడ్డి 
  • హత్యలో ప్రధాన సూత్రధారి 
  • చంద్రబాబుపై జరిగిన 
  • అలిపిరి బ్లాస్టింగ్​లోనూ 
  • ఆయనే మాస్టర్ మైండ్ 

భద్రాచలం / కరీంనగర్ ​/ ములుగు, వెలుగు: మావోయిస్టులు వరుసగా లొంగు‘బాట’ పడ్తున్నారు. దండకారణ్యం వీడి.. ఆయుధాలు అప్పగించి.. సరెండర్​ అవుతున్నారు. బుధవారం ఒక్క రోజే ఇటు మహారాష్ట్రలో, అటు చత్తీస్​గఢ్​లో భారీగా నక్సల్స్​ లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్​ వంటి వారు ఇందులో ఉన్నారు. ​

60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ఎదుట సరెండర్​ అయ్యారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే  చత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో  27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అదే రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో 100 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఇక.. మావోయిస్టు మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్​ ఆశన్న గురువారం చత్తీస్​గఢ్​ సీఎం ఎదుట లొంగిపోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 

ఆయన వెంట 70 మంది మావోయిస్టులు కూడా సరెండర్​ అవుతారన్న చర్చ జరుగుతున్నది. ఆపరేషన్​ కగార్​లో భాగంగా ఈ ఏడాది మేలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్​బసవరాజ్​ను భద్రతా బలగాలు ఎన్​కౌంటర్​ చేశాక మావోయిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. ఆయుధాలను వీడాలన్న మల్లోజుల లేఖతో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరి.. తాజా లొంగుబాట్లకు దారితీశాయి. మావోయిస్టు పార్టీ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభం ఎదుర్కొంటున్నది. 

తుపాకీని అప్పగించిన మల్లోజుల

మావోయిస్టు పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్​ అలియాస్​ భూపతి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​కు తన ఆయుధాన్ని అప్పగించారు.  45 ఏండ్ల  సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి ముగింపు పలికారు. తన ఏకే-47 ఆయుధాన్ని సీఎంకు అప్పగించి లొంగిపోయారు. తనతో పాటు వచ్చిన మరో 60 మంది మావోయిస్టులు కూడా తమ వద్ద ఉన్న మొత్తం 54 ఆయుధాలను పోలీసులకు అప్పగించి సరెండర్​ అయ్యారు. 

అన్ని రాష్ట్రాల్లో కలిపి మల్లోజుల వేణుగోపాల్​పై రూ. 6 కోట్ల రివార్డు ఉండగా.. ఆ మొత్తాన్ని ఆయనకు ఫడ్నవీస్​ అందజేశారు. మిగిలిన మావోయిస్టులు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రివార్డులు తీసుకొని జనజీవన స్రవంతిలో కలిశారు. మొత్తంగా మావోయిస్టుల నుంచి ఏడు ఏకే -47లు, 9 ఇన్సాస్​ రైఫిళ్లతో పాటు ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇటీవల మావోయిస్టు పార్టీతో విభేదించిన మల్లోజుల వేణుగోపాల్ దండకారణ్యం నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లోకి సుమారు 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. ముందస్తు సమాచారంతో పోలీసులు మంగళవారం 61 మంది మావోయిస్టులను బస్సుల్లో గడ్చిరోలీ జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చల అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ సమక్షంలో మల్లోజుల తన లొంగుబాటును ప్రకటించారు. మల్లోజులతో పాటు ముగ్గురు దండకారణ్యం స్పెషల్​ జోనల్​ కమిటీ మెంబర్లు, పది మంది డివిజన్​ కమిటీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసిన కీలక మావోయిస్టులలో ఉన్నారు. 

లొంగిపోయింది వీళ్లే..!

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​ ఎదుట లొంగిపోయిన మావోయిస్టుల జాబితాను మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. వీరిలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్​ సోనూ అలియాస్ భూపతి, సలాకుల సరోజ అలియాస్​ లత, ఇర్రి మోహన్​రెడ్డి అలియాస్ వివేక్​, రాజు అలియాస్​ కమలసాయి, రాజేశ్​ అలియాస్ నిఖిల్​ లేఖని, ప్రియాంక అలియాస్​ వసంతి, గంగూ అలియాస్​ జిత్రూ, శబర్ అలియాస్​ అర్జున్​, మైను గవాడే, సాగర్​ సైదం, పార్వతి అలియాస్​ పద్మ సైదం, లత, రాందాస్​ గవాడే, రవి, రాగో మోహన్​ దా, మంజు కోవచ్చి, కోసా కొవాసి, మంగ్లో జోగా వేలో, నీలవెట్టి, పైరావి కుంజాం, సునీల్​ మంగ్లూ, నిర్మల తడామి, బిచ్చం కడియామి, మంగళి అలియాస్​ కరుణ, గీత పొల్యం, కమలేశ్ నూకో, రోహిత్ తేలం, జ్యోతి అలియాస్​ సుగుణ, నరసు అలియాస్​ స్వరూప, విష్ణు ఉసెండి, సుక్రో వెల్దా, సురేశ్​ తలాంగ్రే, మధు టేకం, రోష్ని కుచ్చాండి, అనిత మర్కాండి, ఘులే గుర్కా, భీమే అలియాస్​ షర్మిల, ప్రగతి, అంజలి కుంజన్​, గంగ సోమ్లూ మడ్కం, భీమి సోడి, రజిత సోయం, సునీత, రంజూ మొడియం, జున్ని అలియాస్​ నారో నరోటి, అడ్మె అలియాస్​ మైని మాధవి, భూమి అలియాస్​ లచ్చి రీతా కుంజం, అమోల్​ సోది, జోగి అలియాస్​ అనూష, అంకిత హలామీ, మంజుల కుజామి, ఉంగి అలియాస్ సంధియా, బల్​దేవ్​ కుంజం, పయాకో అలియాస్​ రవి ఊకె, బుజ్జి అలియాస్​ అస్మిత, అస్మాన్​ అలియాస్​ రాము కరన్​, మహేశ్​ టేలం, రూరా అలియాస్​ సునీల్​, రాంబట్టి తెలాని, సవి అలియాస్​ సోవి తుమ్రేటి ఉన్నారు.

70 మందితో కలిసి లొంగిపోయేందుకు ఆశన్న రెడీ!

 మరో సీనియర్ మావోయిస్టు నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్  లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆశన్నతోపాటు వివిధ క్యాడర్లకు చెందిన సుమారు 70 మంది చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. 

తమ ఆయుధాలను కూడా అప్పగించే ఈ బృందంలో డీకేఎస్ఐడ్సీ సభ్యులు రాజమన్, రనితతోపాటు ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ కమిటీల సభ్యులు ఉన్నట్లు తెలిసింది. 

వీరంతా ఇప్పటికే జగదల్పూర్ చేరుకున్నారని, గురువారం నిర్వహించే లొంగుబాటు సభకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నా యని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

అలిపిరి ఘటనలో మాస్టర్​ మైండ్​ ఆశన్న

ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఆశన్న.. గత 45 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మందుపాతర పేల్చి అప్పటి హోం మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డిని హత్య చేయడంతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ లో ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్రను పాయింట్ బ్లాంక్ లో కాల్చి హత్య చేసిన ఘటనలో ఆశన్నే కీలక సూత్రధారిగా పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 

అంతేగాక 2003 అక్టోబర్ లో అప్పటి సీఎం చంద్రబాబుపై తిరుపతి అలిపిరి వద్ద మందుపాతర పేల్చిన ఘటనలోనూ ఆశన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.  ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా, చత్తీస్ గఢ్ లో నార్త్ వెస్ట్ సబ్ జోనల్ కమాండ్ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్న ఆశన్న.. ఈ ఏడాది ఏప్రిల్ లో శాంతిచర్చలకు సిద్ధమంటూ రూపేష్ పేరిట స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఆశన్న ప్రాథమిక విద్య ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో, సెకండరీ విద్య కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్‌‌‌‌లో కొనసాగింది. హనుమకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాలవైపు ఆకర్షితుడై.. చదువును మధ్యలోనే నిలిపేశారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏండ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాలు భావిస్తున్నాయి. 

వెంకటాపూర్‌‌‌‌ పోలీస్​ స్టేషన్‌‌‌‌లో 38 ఏండ్ల కిందట్నే తక్కళ్లపల్లి వాసుదేవరావుపై క్రైమ్‌‌‌‌ రిపోర్టు నమోదైంది. ఆయన తండ్రి భిక్షపతిరావు అనారోగ్య సమస్యలతో కొన్నేండ్ల కింద మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. హనుమకొండ గోపాల్‌‌‌‌పూర్‌‌‌‌లో నివాసం ఉంటున్న సోదరుడు సహదేవరావు దగ్గర తల్లి సరోజన ఉంటుంది. వాసుదేవరావు అలియాస్‌‌‌‌ ఆశన్నను తామెప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలిపారు.

చత్తీస్​గఢ్​లోనూ భారీగా..

చత్తీస్​గఢ్​ దండకారణ్యంలోని మావోయిస్టులు కూడా మల్లోజుల వేణుగోపాల్​ను అనుసరిస్తున్నారు. ఆయన బాటలోనే బుధవారం సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్​చౌహాన్​ ఎదుట 10 మంది మహిళలు, 17 మంది పురుషులు.. మొత్తం 27 మంది మావోయిస్టులు సరెండర్​ అయ్యారు. పీఎల్​జీఏ బెటాలియన్​  నంబర్​ వన్​, రీజనల్​ మిలటరీ కంపెనీకి చెందిన హార్డ్ కోర్​ మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. 

లొంగిపోయినవారిలో రూ. 10 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టుతో పాటు, 8 లక్షల రివార్డు ఉన్న ముగ్గురు, రూ.3లక్షల రివార్డు ఉన్న ఒకరు, రూ.2లక్షల రివార్డు ఉన్న ఇద్దరు, ఒక లక్షరూపాయల రివార్డు ఉన్న 9 మంది ఉన్నారు.  వీరందరిపై రూ. 50 లక్షల రివార్డు ఉండగా పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని ఎస్పీ కిరణ్​చౌహాన్​ అందజేశారు. 

చత్తీస్​గఢ్​లోని ఉత్తర బస్తర్​ డివిజన్​లోని కాంకేర్​ జిల్లాలో కామ్తోడా బీఎస్​ఎఫ్​ క్యాంపు వద్దకు 100 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు ఆయుధాలతో వచ్చారు. వీరిలో కంపెనీ నెంబర్​ 5 కమాండర్​ రాజు సలాం, మరో ఇద్దరు కమాండర్లు​ ప్రసాద్​, మీనా ఉన్నారు. వీరు బయటకు వస్తున్నారన్న సమాచారంతో బస్సుల్లో క్యాంపు వద్దకు తరలించి, భద్రతను పెంచారు. హైఅలర్ట్ ప్రకటించారు. 

కాంకేర్​ ఎస్పీ ఐకె ఎలిశేల ఆధ్వర్యంలో లొంగిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కొండగావ్​ జిల్లాలో కూడా రూ.5లక్షల రివార్డు ఉన్న గీతా సలాం అలియాస్​ కమలిని ఆయుధంతో లొంగిపోయారు. మూడు జిల్లాల్లో ఒకేసారి 128 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయేందుకు రావడంపై బస్తర్​ ఐజీ సుందర్​రాజ్.​ పి స్పందిస్తూ.. శాంతి స్థాపన కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అబూజ్​మాఢ్​ దండకారణ్యం ఇక మావోయిస్టు రహిత ప్రాంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.