
- జరాంగే డిమాండ్లకు ఓకే..
- మరాఠా కోటా అమలుకు ఒప్పుకున్న ప్రభుత్వం
- జరాంగేతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- అర్హులైన మరాఠాలకు కున్బీ సర్టిఫికెట్లు ఇస్తామని హామీ
ముంబై: మరాఠాలకు 10 శాతం కోటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్ డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. పలు కీలక డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మరాఠాలకు కోటా అమలు చేస్తామని, అర్హులైన మరాఠాలకు కున్బీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపింది.
మంగళవారం మధ్యాహ్నం మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ జరాంగేతో ఆజాద్ మైదానంలో భేటీ అయి కోటాపై చర్చలు జరిపింది. సబ్ కమిటీ మెంబర్లు శివేంద్రసిన్హ్ భోస్లే, ఉదయ్ సామంత్, మాణిక్ రావ్ కోకాటే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. డిమాండ్లను అమలు చేయడానికి ముసాయిదా ఖరారు చేశామని, హైదరాబాద్ గెజిట్ ను అమలు చేస్తామని జరాంగేకు కమిటీ సభ్యులు తెలిపారు.
ఎంక్వైరీ చేసి అర్హులైన మరాఠాలందరికీ కున్బీ క్యాస్ట్ సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా దీక్షలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకూ రూ.15 కోట్లు అందించామని, మరో వారం రోజుల్లో మరింత సాయం అందిస్తామని వివరించారు. అలాగే, కోటా మద్దతుదారులపై నమోదైన కేసులను కూడా రద్దు చేస్తామని వెల్లడించారు.
ఈ విజయం మరాఠాలదే: జరాంగే
కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అనంతరం డ్రాఫ్ట్ పాయింట్లను మనోజ్ జరాంగే తన మద్దతుదారులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా మైదానంలో సపోర్టర్లందరూ ఆనందంలో మునిగి తేలారు. కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. జరాంగే మాట్లాడుతూ మరాఠాలకు కోటా అమలు కోసం తాము చేపట్టిన దీక్షలో విజయం సాధించామని, ఈ గెలుపు మరాఠాలందరికీ దక్కుతుందన్నారు. తన దీక్షకు మద్దతు తెలిపిన
వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.