
రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ (మార్చి14) అత్యధిక కరెంట్ వినియోగించినట్లు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఉదయం10.30 గంటల వరకే 15,062 మెగావాట్ల విద్యుత్తు వినియోగించినట్లు తెలిపారు. సోమవారం మొత్తం 14,138 మెగావాట్ల కరెంట్ వాడకం జరిగినట్లు ప్రభాకర్ తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు, ప్రజల వినియోగం కూడా పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని పేర్కొన్నారు. గతేడాది ఇదేరోజు 12,727 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదయింది.
రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ మంగళవారం నాటికి 9121 మెగావాట్లు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 5738 మెగావాట్లు విద్యుత్తు వినియోగించారు. వేసవికాలం ముగిసేసరికి 16,000 మెగావాట్ల రికార్డ్ ను దాటే అవకాశం ఉందని తెలిపారు.
వేసవిలో వేసవిలో రైతులతో పాటు వినియోగదారులందరికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు శాఖ చర్యలు తీసుకుంటోంది. మొత్తం విద్యత్తు వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికి ఉపయోగించనున్నారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత తెలంగాణనే ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్నారు.