
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం టెర్రర్ ఎటాక్‌తో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 26 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదులు.. వారికి సహాయసాకారాలు అందిస్తోన్న పాక్ పై భారత్ గుర్రు మీద ఉంది. ఎలాగైనా దెబ్బకు దెబ్బకొట్టాలని భారత్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌ను పలు రకాలుగా అష్టదిగ్భంధనం చేస్తోంది. ఇందులో భాగంగానే సింధు నది జలాల ఒప్పందం రద్దు, ఆ దేశ పౌరులు వీసాలు రద్దు చేయడంతో పాటు దౌత్య సంబంధాలను పూర్తిగా కట్ చేసుకుంది.
పహల్గాం ఘటన అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోన్న అగ్ర రాజ్యం అమెరికా.. భారత్, పాక్ దేశాలకు కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో చర్చించారు. పహల్గాం టెర్రర్ ఎటాక్, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఇరువురు డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా మార్కో రూబియో కీలక సూచనలు చేశారు.
ALSO READ | 36 గంటల్లో పాక్‌పై భారత్ యుద్ధం మొదలు.. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశంలో అల్లకల్లోలం
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్‌కు సూచించారు. మార్కో రుబియోతో జరిగిన చర్చల వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జైశంకర్ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడినవారు, మద్దతుదారులను న్యాయం ముందు నిలబెట్టాలని మార్కో రూబియోతో చెప్పినట్లు జైశంకర్ పేర్కొన్నారు. అయితే.. పాకిస్థాన్‌తో చర్చించాలని రూబియో చెప్పిన విషయాన్ని జైశంకర్ ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ విషయంలో భారత్ వెనక్కి తగ్గలా కనిపించడం లేదు.
ఉద్రిక్తలు తగ్గించి శాంతి కోసం కృషి చేయాలని అమెరికా చెప్పిన కూడా భారత్ లైట్ తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయడానికి ఇండియా దృఢ సంకల్పంతో ఉన్నందున పాకిస్థాన్‌తో చర్చించేందుకు భారత్ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదని.. అది అసంభవమని పేరు చెప్పడానికి ఇష్టపడిని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు వెల్లడించారు.
గత అనుభవాల దృష్ట్యా ఈ సారి భారత్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదని.. ఉగ్రవాదులపై వారిని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెబుతోందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాక్ పై దాడికి భారత్ భారీగానే ప్లాన్ చేస్తోందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.