ఆర్మీ కుటుంబాలకు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తున్న మరేన

ఆర్మీ కుటుంబాలకు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తున్న మరేన

యుద్ధంలో చనిపోయిన సైనికుల్ని తలచుకొని వాళ్ల కుటుంబాలు ఎంతగా బాధపడతాయో ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే... ఆమె పెద్దకొడుకు దేశంకోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా లోలోపలే కుమిలిపోయేది. ఆ బాధ నుంచి తేరుకునేందుకు... తనలా బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్న సైనిక కుటుంబాలను కలిసేది. యుద్ధం వాళ్లకు మిగిల్చిన బాధని పోగొట్టడంతో పాటు వాళ్ల కన్నీళ్లు తుడవాలని వాళ్లకు కౌన్సెలింగ్ సెషన్స్ ఇవ్వడం​ మొదలు పెట్టింది. పేరు మరేనా మన్యెవెస్కా. ఉక్రెయిన్​కి చెందిన ఆమె ఒక సైకాలజిస్ట్. దాదాపు ఎనిమిదేండ్లుగా  ఆ దేశంలోని ఆర్మీ కుటుంబాలకు ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోన్న ఈమె గురించి... 

మొదటి నుంచి సోషల్ వర్క్​లో ముందుండేది మరేన.  సోషల్ వర్క్​లో భాగంగా... హక్కుల కోసం పోరాడే వాళ్ల తరఫున మాట్లాడేది. అంతేకాదు జైలు శిక్ష కారణంగా మానసికంగా కుంగిపోయిన ఖైదీలకు ధైర్యం చెప్పేది. ఆమె సైకాలజిస్ట్​ కావడానికి  చిన్నప్పటి అనుభవాలు ఓ కారణం. ఆమెకు పన్నెండేండ్లు ఉన్నప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాన్న ఎందుకలా చేశాడు? బతికి ఉంటే బాగుండేది’ అనే ఆలోచనలు కొన్నేండ్ల దాకా ఆమె మనసులోంచి పోలేదు. దాంతో పెద్దయ్యాక సైకాలజిస్ట్ అవ్వాలనుకుంది. 

కొడుకు మరణంతో...
మరేనా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఏ ఇబ్బంది లేని ఆమె జీవితం 2014లో ఒక్కసారిగా  మారిపోయింది. కారణం డాన్​బాస్ ప్రాంతంలో రష్యా సైన్యంతో పోరాడుతూ పెద్ద కొడుకు వ్లాడ్  చనిపోవడమే.  కొడుకు మరణంతో ఆమె బాగా కుంగిపోయింది. అతని జ్ఞాపకార్థం ఏదైనా చేయాలనుకుంది మరేన. తనలాగ  పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్​(పీటీడిఎస్)తో బాధపడుతున్న సైనిక కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందామెకు. దాంతో లివ్​ సిటీలో ఆర్మీ కుటుంబాలకి సేవలందించే సంస్థలో సైకాలజిస్ట్​గా చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్​పై రష్యా సైనికదాడి మొదలైనప్పటి నుంచి... ప్రతిరోజు బాంబు పేలుళ్లు, తుపాకుల మోత ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు చనిపోయారు. బిడ్డల్ని కోల్పోయిన బాధతో కుమిలిపోతున్న సైనిక కుటుంబాలకి ధైర్యం చెప్పే బాధ్యత తీసుకుంది మరేన. అలా రోజుకి కనీసం 30 మందికి కౌన్సెలింగ్​ ఇస్తోందామె.  

నా కథ చెప్తూ...
‘‘ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా సైనిక దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మా దేశంలో చాలామంది పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్​తో బాధపడుతున్నారు. పిల్లల మరణాన్ని తట్టుకోలేక కొందరు మద్యం, డ్రగ్స్​కు అడిక్ట్ అవుతున్నారు. మరికొందరిలో విపరీతమైన కోపం కనిపిస్తోంది. అలాంటి వాళ్లను గుర్తించి, కౌన్సెలింగ్ ఇస్తున్నా. వాళ్లకు నా కథ చెప్తా. దేశాన్ని కాపాడడం కోసం మీ  బిడ్డలు చేసిన ప్రాణ త్యాగం చాలా గొప్పది. మీరు అందుకు గర్వపడాలని వాళ్లకు  ధైర్యం ఇస్తా” అని చెప్తోంది 51 ఏండ్ల మరేన.