
ఒట్టావా: జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు ఇండియాతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకుంటామని కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్ని అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభిస్తానని తెలిపారు. ఇండియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోదల్చుకోలేదని వివరించారు. అదేవిధంగా, వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపర్చుకుంటామని తెలిపారు. పొరుగు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాగా, తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జనవరిలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీకి 85.90 శాతం ఓట్లు పోలయ్యాయి. అనంతరం ఆ పార్టీ ప్రతినిధుల భేటీలో కెనడా ప్రధానిగా కార్నిని ఎన్నుకున్నారు. త్వరలో మార్క్ కార్ని.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా కార్ని సోమవారం విక్టరీ స్పీచ్‌లో కీలక కామెంట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు వేసే సుంకాలు అటు కెనడా.. ఇటు ఇండియాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఇండియన్లు ఎక్కువగా కెనడాకు వచ్చేందుకు ఇష్టపడుతుంటారని తెలిపారు. ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు.
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు
ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని మార్క్ కార్ని స్పష్టం చేశారు. కెనడాను అమెరికాలో కలుపుకునేందుకు ట్రంప్ కుట్ర పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘అమెరికన్లు మా మట్టి, మా వనరులు, మా నీళ్లు, మా భూమిని గుంజుకోవాలని చూస్తున్నరు. కెనడా వర్కర్లు, ఫ్యామిలీలు, వ్యాపారులను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ గెలిస్తే.. మన జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. ట్రంప్‌ను ఎప్పటికీ ఈ విషయంలో గెలవనివ్వం. కెనడాతో అమెరికా స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యం విధానాలు కొనసాగించే వరకు మా ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. కెనడా ఏనాటికీ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాదు. ఏ దేశంతో కూడా మేము పోరాటం కోరుకోవడం లేదు’’అని కార్ని స్పష్టం చేశారు.