
ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్లలో ఒకడైన మార్క్ వా బ్యాటింగ్ చూస్తే వచ్చే మజాను వేరు. అతను క్రీజులో ఉంటే ఫ్యాన్స్‌కు పండగే. అతనాడే అద్భుతమైన షాట్లు మంత్రముగ్దుల్ని చేస్తాయి. చిన్న చితకా జట్లపై కాకుండా.. ప్రత్యర్థి బౌలింగ్ పదునుగా ఉన్నప్పుడు.. వికెట్ చాలెంజింగ్ ఉన్నప్పుడు మార్క్‌వా మరింత చెలరేగుతాడు. అతడి బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చాయి. పైగా జట్టును గెలిపించడంతో వా ముందుంటాడు. 1999 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు అసాధారణ రీతిలో ఆడితే మార్క్‌వా కూడా నిలకడగా రాణిస్తూ వచ్చాడు. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉండే మార్క్ కళ్లు చెదిరే క్యాచ్‌లు కూడా పట్టాడు. స్లిప్స్‌లో వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లలో ఒకడైన వా.. బౌలర్‌గానూ టీమ్‌కు ఉపయోగపడ్డాడు. 1999 వరల్డ్‌కప్‌లో ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో వా ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు. 41.66 సగటుతో 375 పరుగులు చేసి.. రాహుల్ ద్రవిడ్ (451), తన సోదరుడు స్టీవ్‌వా (398), సౌరవ్ గంగూలీ (379) తర్వాత నాలుగో ప్లేస్‌లో నిలిచాడు. ఈ టోర్నీలో మార్క్ వా ఆడిన షాట్లు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఏదో బంతిని బాదినట్టు కాకుండా మంచి గ్రేస్‌తో షాట్లు ఆడుతూ అతను బౌండ్రీలు రాబట్టాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మార్క్‌వాపై ఆసీస్ టీమ్ భారీ అంచనాలు పెట్టుకుంది. వాటిని అతను అందుకున్నాడు. అయితే, ఇండియాపై 83 రన్స్, జింబాబ్వేపై 104 రన్స్ చేసిన తర్వాత.. సౌతాఫ్రికాతో లీగ్ మ్యాచ్, సెమీఫైనల్లో మార్క్ నిరాశ పరిచాడు. కానీ, ఫైనల్లో మాత్రం తనదైన శైలిలో ఆడాడు. లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన తుదిపోరులో బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే.. గిల్‌క్రిస్ట్‌తో కలిసి మార్క్‌వా శుభారంభం ఇచ్చి జట్టు విజయానికి పునాది వేశాడు. చివరి దాకా క్రీజులో నిలిచిన మార్క్ టోర్నీకే హైలైట్ అనదగ్గ రీతిలో చిరకాలం గుర్తిండిపోయే షాట్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో పాక్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ స్టంప్స్ మీదుగా పదునైన బంతులతో కవ్విస్తుంటే మూమెంట్ కోసం వా వేచి చూశాడు. అది రాగానే.. కుడి మోకాలిపై కూర్చొని అద్భుతమైన కవర్ డ్రైవ్ చేశాడు. అతను కొట్టిన క్లాసిక్ షాట్‌కు బంతి మెరుపు వేగంతో బౌండ్రీ రెప్‌ను తగిలింది. ఆశ్చర్యపోవడం బౌలర్‌వంతైంది. ఈ షాట్ మార్క్‌వా షాట్‌గా నిలిచిపోయింది.