అమెరికా కోర్టు అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు చట్ట విరుద్ధమైనవిగా తీర్పు వెరువరించిన వేళ సోమవారం మంచి లాభాలతో మార్కెట్లు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్సాహం నేడు కనిపించలేదు. మార్కెట్లు స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఏకంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 797 పాయింట్లు లాస్ కాగా.. మరో సూచీ నిఫ్టీ 222 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 23 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 244 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి.
ప్రధానంగా స్టాక్ మార్కెట్లలో నేడు ఐటీ కంపెనీల షేర్లలో నమోదైన విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ కూడా ఇంట్రాడేలో 3 శాతం క్రాష్ అయ్యింది. అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఆంత్రోపిక్స్ రోజురోజుకూ విడుదల చేస్తున్న శక్తివంతమైన ఏఐ ఏజెంట్లను విడుదల చేయటం పెద్దపెద్ద టెక్ కంపెనీలకు కూడా చెమటలు పట్టిస్తోంది. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా లాంటి టెక్ కంపెనీలు కూడా 3 శాతానికి పైగా నేడు నష్టపోయాయి.
మార్కెట్లు ఒక్కసారిగా బేర్స్ చేతిలోకి జారిపోవటంతో.. బీఎస్‌ఈలో కేవలం 1,152 షేర్లు మాత్రమే లాభాల్లో ఉండగా.. ఏకంగా 2,154 షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాలతో ఎరుపెక్కాయి. ముఖ్యంగా ఐటీ, రియల్టీ, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టెక్నాలజీ రంగంలో AI ప్రభావంపై నెలకొన్న ఆందోళనలు ఐటీ షేర్లను భారీగా కుంగదీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. వాణిజ్య ఒప్పందాల విషయంలో వెనక్కి తగ్గే దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇటు ఆసియా మార్కెట్లు నీరసించగా.. అటు యూఎస్ మార్కెట్లు 2 శాతం మేర నష్టాలతో క్లోజ్ అయ్యాయి. నేడు ట్రంప్ ఇవ్వబోయే స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యూరోపియన్ యూనియన్ అమెరికాతో డీల్‌ను నిలిపివేయడం వంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి.
దేశీయంగా చూస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు క్షీణించి 90.96 స్థాయికి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలోపేతం కావడం రూపాయిపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక శాతం పెరిగి 72.13 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత వాణిజ్య లోటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణంపై భారం పడే అవకాశం ఉంది. దీనికి తోడు నేడు నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ కావడంతో మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి.
