- 1,205 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- గత రెండు సెషన్లలో 2,577 పాయింట్లు అప్
- రూ.15.80 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- నేడు మార్కెట్లకు సెలవు
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముగిసేలా సంకేతాలు అందుతుండడంతో మన మార్కెట్ రెండో రోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.7.82 లక్షల కోట్లు పెరిగింది.
ముంబై: ఇరాన్– అమెరికా యుద్ధం ఆగేటట్టు కనిపించడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు వరుసగా రెండో రోజూ ర్యాలీ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ 1,205 పాయింట్లు (1.63 శాతం) లాభపడింది. 75,273.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 394.05 పాయింట్లు ఎగిసి 23,306.45 వద్ద సెటిలయ్యింది.
మార్కెట్ బలంగా ఓపెన్ అయి లాభాలను కొనసాగించింది. నిఫ్టీ ఇంట్రాడే హై 23,465.35 వరకు వెళ్లి, చివరి గంటలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంత తగ్గింది. బ్రాడర్ మార్కెట్లు కూడా బుధవారం బలంగా కదిలాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2.3శాతం, స్మాల్‌క్యాప్ 2.6శాతం పెరిగాయి. సెక్టార్లలో కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 3.5శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు 2శాతానికిపైగా లాభపడ్డాయి.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎక్కువ లాభపడగా, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. ‘‘నిఫ్టీ రెండో రోజు కూడా భారీగా పెరిగింది. 23,400 స్థాయిని దాటలేకపోయినా, ఇంట్రాడే గరిష్టాల దగ్గరలోనే ముగిసింది. డైలీ చార్ట్‌పై పెద్ద బుల్ క్యాండిల్ ఏర్పడింది. 23,400–--23,600 స్థాయి కీలక రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది.
మార్కెట్ నిలకడగా పెరిగితే 23,850 స్థాయి వరకు వెళ్లొచ్చు. మార్కెట్ పడినా లేదా కన్సాలిడేషన్ వచ్చినా 23,000 స్థాయిలో సపోర్ట్ దొరుకుతుంది” అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు. శ్రీ రామ నవమి కారణంగా మార్చి 26 న (గురువారం) మార్కెట్లకు సెలవు.
ఇన్వెస్టర్ల సంపద రూ.15.80 లక్షల కోట్లు జూమ్
ఇన్వెస్టర్ల సంపద బుధవారం రూ.7.82 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.423.16 లక్షల కోట్ల నుంచి రూ.430.99 లక్షల కోట్లకు చేరింది. గత రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.15.80 లక్షల కోట్లు ఎగిసింది. ఈ టైమ్‌లో సెన్సెక్స్ 2,577 పాయింట్లు (3.54 శాతం) పెరిగింది.
20 పైసలు తగ్గిన రూపాయి
డాలర్‌తో రూపాయి విలువ బుధవారం 20 పైసలు క్షీణించి 93.96 వద్ద ముగిసింది. మరో జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా మార్కెట్ల నుంచి వెళ్లిపోతుండడంతో రూపాయి విలువ పడిపోతోంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో 93.94 వద్ద ఓపెన్ అయ్యింది. రోజంతా 93.86–94.08 రేంజ్‌లో కదిలి, చివరికి 94.05 వద్ద సెటిలయ్యింది.
రూపాయి మంగళవారం 23 పైసలు క్షీణించి 93.76 దగ్గర ముగిసిన విషయం తెలిసిందే. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నికరంగా రూ.8 వేల కోట్ల విలువైన షేర్లను అమ్మగా, బుధవారం మరో రూ.1,800 కోట్ల షేర్లను విక్రయించారు. క్రూడాయిల్ ధరలు 5 శాతం తగ్గి 99 డాలర్లకు దిగొచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, సప్లయ్ పెరిగే అవకాశం ఉండడంతో ఆయిల్ ధరలు పడుతున్నాయి.
