మార్కెట్ మళ్లీ క్రాష్.. 1,690 పాయింట్లు పడిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు రూ.9 లక్షల కోట్ల నష్టం..

మార్కెట్ మళ్లీ క్రాష్.. 1,690 పాయింట్లు పడిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు రూ.9 లక్షల కోట్ల నష్టం..
  • 89 పైసలు క్షీణించి  94.85కు పడిపోయిన రూపాయి
  • ఆయిల్​ కంపెనీలకు కేంద్రం ఊరట 
  • పెట్రోల్, డీజిల్​పై రూ.10 చొప్పున ట్యాక్స్​ తగ్గింపు 
  • పెట్రోల్ ​బంకుల్లో ధరలు యథాతథం

ముంబై: యుద్ధం  ముగుస్తుందనే ఆశలు సన్నగిల్లడంతో  భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. మరో రూ.తొమ్మిది లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద  ఆవిరైంది.  ఈ నెలలో ఇప్పటివరకు నిఫ్టీ 11 శాతం పడగా, ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు నష్టపోయారు.   నిఫ్టీ శుక్రవారం 487 పాయింట్లు తగ్గి 22,850 కిందకు జారింది. 

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందనే అంచనాల నేపథ్యంలో మంగళ, బుధవారం సెషన్లలో బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  3.5శాతం ర్యాలీ చేశాయి. కానీ, ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అనిశ్చితి పెరిగింది.  ‌‌‌‌‌‌‌‌ సెన్సెక్స్ శుక్రవారం 1,690 పాయింట్లు తగ్గి 73,583 వద్ద,  నిఫ్టీ  2.09 శాతం నష్టపోయి  22,820 వద్ద ముగిశాయి. నిఫ్టీలో  ఇండెక్స్ హెవీ వెయిట్ షేరు  రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌‌‌‌‌) 5శాతం పతనమై టాప్ లూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. 

ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్‌‌ ఎగుమతులపై విండ్‌‌ఫాల్ ట్యాక్స్ వేయడమే కారణం. ఇండిగో, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ షేర్లు 3–-4శాతం వరకు తగ్గాయి.  భారతి ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, టీసీఎస్‌‌‌‌‌‌‌‌, పవర్ గ్రిడ్ మాత్రమే లాభపడ్డాయి.  అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  రెడ్‌‌‌‌‌‌‌‌లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్ 4శాతం పడిపోయింది.  రియల్టీ 3శాతానికి పైగా నష్టపోగా,  ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3శాతం వరకు పడ్డాయి. 

మార్కెట్ ఎందుకు పడిందంటే?

రూపాయి పతనం:  డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మన కరెన్సీ  పతనం కొనసాగుతోంది.  రూపాయి విలువ శుక్రవారం  89పైసలు క్షీణించి  94.85 వద్ద ముగిసింది.   కొత్త జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది.  ‘‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు  కొనసాగుతుండడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల  వల్ల రూపాయి బలహీనపడింది”అని  ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.  

ఇరాన్-యూఎస్ యుద్ధం: చర్చలు బాగానే జరుగుతున్నాయని అమెరికా ప్రెసిడెంట్  ట్రంప్ చెబుతున్నా,  ఇరాన్ మాత్రం  అమెరికా ప్రపోజల్‌‌ను తిరస్కరించింది. కొత్తగా ఐదు డిమాండ్లు చేసింది.  ట్రంప్ ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై  దాడులను వాయిదా వేశారు. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య  ఉద్రిక్తతలు తగ్గుతాయనే  ఆశలు మసకబారాయి.

గరిష్టాల్లో ఆయిల్ ధరలు: బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు  110 డాలర్లకు చేరుకుంది.   హోర్మూజ్ జల సంధి ఎక్కువ కాలం మూతపడి ఉంటే  ఆయిల్ ధర 200 డాలర్ల వరకు పెరగొచ్చని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆయిల్ ధరలు గరిష్టాల్లో ట్రేడవుతుండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌ పడుతోంది. 

గ్లోబల్ మార్కెట్లు వీక్: వాల్ స్ట్రీట్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అతి పెద్ద పతనం చూసింది. ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ500 గురువారం  -1.7శాతం, నాస్‌‌‌‌‌‌‌‌డాక్‌‌‌‌‌‌‌‌ -2శాతం తగ్గాయి. ఈ ఎఫెక్ట్ శుక్రవారం గ్లోబల్ మార్కెట్లపై పడింది.  ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ట్రేడవగా,  యూరప్ రెడ్‌‌‌‌‌‌‌‌లో ముగిశాయి.

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల అమ్మకాలు: ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు) బుధవారం నికరంగా రూ.1,805 కోట్ల విలువైన షేర్లను అమ్మగా,   శుక్రవారం మరో రూ.4,367 కోట్ల షేర్లను విక్రయించారు.  గత 20 సెషన్లలో దాదాపు రూ.61 వేల కోట్లను మార్కెట్ నుంచి విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకున్నారు.