సెబీ కీలక నిర్ణయం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సూపర్ ప్రయోజనం

సెబీ కీలక నిర్ణయం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సూపర్ ప్రయోజనం

కరోనా తర్వాతి నుంచి దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు చేస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి కంటే అనుభవజ్ఞుల చేతిలో ఉండే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని చాలా మంది భావించటమే దీనికి కారణం. దీనికి తోడు కంపెనీలు చిన్న మెుత్తంలో ఎస్ఐపీలను రోజువారీ, వారం వారీ, నెలవారీ అంటూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం కూడా వీటి క్రేజ్ ను భారీగా పెంచేసింది. 

తాజాగా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ శుక్రవారం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఎగ్జిట్ లోడ్ మెుత్తాన్ని గతంలో ఉన్న 5 శాతం నుంచి ప్రస్తుతం 3 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పింది. దీంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు పెద్ద ప్రయోజనం కలగనుంది. ఇదే సమయంలో సెబీ ఇన్సూరెన్స్, కమోడిటీస్, ఐపీవోలకు సంబంధించిన కొన్ని నియమాల్లో కూడా మార్పులను ప్రకటించింది. 

అసలు ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి..?
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తరచుగా వినే పదాల్లో ఎగ్జిట్ లోడ్ కూడా ఒకటి. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత తమ డబ్బును వెనక్కి తీసుకోవాలనుకుంటే దానిపై ఫండ్ హౌస్ ఎగ్జిట్ లోడ్ వసూలు చేస్తాయి. అయితే పెట్టుబడిని నెల రోజుల నుంచి ఎంపిక చేసిన గడువు లోపు వెనక్కి తీసుకుంటే మాత్రమే ఈ అదనపు ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత చేసే యూనిట్ అమ్మకాలపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ రుసుము వసూలు చేయవు మ్యూచువల్ ఫండ్ సంస్థలు.