వరుసగా మూడో సెషన్లోనూ మార్కెట్స్ డౌన్.. 504 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

వరుసగా మూడో సెషన్లోనూ మార్కెట్స్ డౌన్.. 504 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

ముంబై:  బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు వరుసగా మూడో సెషన్‌‌లోనూ నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌తో పాటు బ్యాంక్ షేర్ల పతనం వలన బీఎస్ఈ సెన్సెక్స్ 504 పాయింట్లు (0.59శాతం) నష్టపోయింది. 85,138.27 వద్ద స్థిరపడింది.  ఎన్ఎస్ఈ  నిఫ్టీ 143.55 పాయింట్లు (0.55శాతం) తగ్గి 26,032.20 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్‌‌లో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్ ఎండ్ టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్, మారుతి, భారతి ఎయిర్‌‌‌‌టెల్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో నిలిచాయి. విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌‌ఐఐలు)  గత మూడు రోజుల్లో నికరంగా రూ.6 వేల కోట్లకు పైగా షేర్లు విక్రయించారు.  రూపాయి విలువ డాలర్‌‌తో పోలిస్తే ఆల్‌‌ టైమ్ కనిష్టానికి పడడం కూడా మార్కెట్ పతనానికి కారణం. 

 స్మాల్‌‌ క్యాప్, మిడ్‌‌క్యాప్ సూచీలు కూడా మంగళవారం తగ్గాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్ రంగాలు బలహీనంగా ఉండగా, టెలికాం, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో నిలిచాయి. ‘‘ఐఐపీ డేటా బలహీనంగా ఉండడం, రూపాయి పతనం, యూఎస్‌‌, ఆర్‌‌‌‌బీఐ పాలసీ నిర్ణయాల ముందు ట్రేడర్లు జాగ్రత్త వహించడంతో మార్కెట్ పడింది”అని  ఎనలిస్టులు పేర్కొన్నారు.