- రూ.5.5 లక్షల కోట్లు జూమ్
- ఒక శాతానికి పైగా లాభపడ్డ సెన్సెక్స్, నిఫ్టీ
- ఫెడ్, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తాయనే అంచనాలతో జోష్
- ఇండియన్ మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్‌ఐఐలు
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ మూడు రోజుల వరుస నష్టాల తర్వాత బుధవారం భారీగా లాభపడ్డాయి. రికార్డు స్థాయులకు చేరువయ్యాయి. నిఫ్టీ 320 పాయింట్లు (1.27 శాతం) పెరిగి 26,205 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1,022 పాయింట్లు (1.21 శాతం) ఎగిసి 85,609 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5.5 లక్షల కోట్లు పెరిగింది.
బీఎస్‌ఈలో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.474.87 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం పెరగడంతో మార్కెట్ ర్యాలీ చేసింది.
అమెరికా ఆర్థిక డేటా అంచనాల కంటే బలహీనంగా రావడంతో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే అంచనాలు ఎక్కువయ్యాయి”అని ఎనలిస్టులు పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లు కూడా లాభాల్లో కదలడంతో మన మార్కెట్లకు సపోర్ట్ లభించిందని అన్నారు. క్రూడ్ ధరలు 60 డాలర్లకు పడిపోవడంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది.
భారీగా విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు..
ఎఫ్‌ఐఐలు మంగళవారం రూ.785 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. బుధవారం మరో రూ.4,970 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. ఎఫ్‌ఐఐల సెల్లింగ్ ప్రెజర్ తగ్గిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
మరోవైపు సెప్టెంబర్ క్వార్టర్ ఎర్నింగ్స్‌లో కంపెనీల రెవెన్యూ డౌన్‌గ్రేడ్‌లు తగ్గాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డబుల్- డిజిట్ వృద్ధి తిరిగి వస్తుందని బ్రోకరేజ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్‌లో ఇండియన్ కంపెనీల రెవెన్యూ 8–10 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. దీంతో మార్కెట్ సెంటిమెట్ బలపడిందని ఎనలిస్టులు చెప్పారు.
రిలయన్స్ మార్కెట్క్యాప్@రూ.21 లక్షల కోట్లు
రిలయన్స్ షేరు రెండు శాతం పెరిగి రూ.1,569కి చేరడంతో మార్కెట్ క్యాప్ విలువ రూ.21 లక్షలకు కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఈ ఏడాది ఇప్పటివరకు 26శాతం రిటర్న్ ఇచ్చింది. సెన్సెక్స్‌లో రిలయన్స్తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్స్ బుధవారం భారీగా పెరిగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి.
ఆర్‌బీఐ రేట్ల కోత..
వచ్చే నెల 3–5లో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల రెపో రేట్ కట్ ఉంటుందని అంచనా. దీని వల్ల రియల్ ఎస్టేట్, పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో షేర్లు బుధవారం ర్యాలీ చేశాయి.
