
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్లో Always Congress Man అనే పదాన్ని తొలగించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. రెండు మూడు రోజుల్లో మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేసి... ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఆయన పార్టీ మారనున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. ఫ్లైట్ లో ఆయనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెంట ఉండటంతో మర్రి కమలదళంలో చేరుతారన్న వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు స్వయంగా వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.