కుమార్తెకు పెళ్లైతే తండ్రి ఆస్తిపై హక్కు కోల్పోదు.. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

కుమార్తెకు పెళ్లైతే తండ్రి ఆస్తిపై హక్కు కోల్పోదు.. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

పెళ్లైన కూతుళ్లకు తండ్రి ఆస్తిలో హక్కు నిరాకరించడం చట్టవిరుద్ధమని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. మూడు తరాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఒక కుమార్తెకు అనుకూలంగా తీర్పునిస్తూ.. అధికారులు ఆమెకు ఆ భూమి యాజమాన్య హక్కులను అప్పగించాలని ఆదేశించింది. వివాహం అయినంత మాత్రాన కన్న తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును కూతురు కోల్పోరని కోర్టు తేల్చిచెప్పింది.

షిమ్లా జిల్లా చోపాల్ తహసీల్‌లోని వ్యవసాయ భూమిని 1972లో 'నౌటోర్ రూల్స్' కింద మీనా రామ్ అనే వ్యక్తికి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న భూమిని అర్హులైన స్థానికులకు సాగుకోసం కేటాయిస్తుంది. అయితే అధికారికంగా 'పట్టా' రాకముందే మీనా రామ్ 1990లో మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆ భూమి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. డాక్యుమెంట్లు సిద్ధమైనా అధికారులు సంతకం చేయలేదు. ఆమె కూడా 2012లో మరణించడంతో వారి ఏకైక చట్టపరమైన వారసురాలైన కుమార్తె ఆ భూమిని సాగు చేస్తూ వచ్చారు.

తల్లిదండ్రులు కాలం చేయటంతో ఆ భూమిని తన పేరుపై రిజిస్టర్ చేయాలని సదరు కుమార్తె 2023లో షిమ్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆశ్రయించారు. సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆమె దరఖాస్తును సమర్థించినప్పటికీ.. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ 2024 జనవరిలో దానిని తిరస్కరించారు. ఒరిజినల్ దరఖాస్తుదారు మరణిస్తే.. వివాహం అయిన కూతుళ్లకు ఆ భూమి కేటాయించరాదని, ఇతర వారసులకు ఇవ్వాలని 1980 నాటి ఒక పరిపాలనా సర్క్యులర్ చెబుతోందని అధికారులు వాదించారు. దీనిని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ నౌటోర్ భూ నిబంధనల ప్రకారం, తండ్రి జీవించి ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు కొత్త భూమి కోసం దరఖాస్తు చేయకూడదని నియమం ఉందని స్పష్టం చేసింది. తండ్రి మరణించిన తర్వాత, వివాహం అయిందనే కారణంతో కూతురికి వారసత్వపు భూమి రాకుండా ఏ నిబంధనా అడ్డుపడదని తెలిపింది. కేవలం ఒక పరిపాలనా సర్క్యులర్ చట్టబద్ధమైన నిబంధనలను రద్దు చేయలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివాహం అయిన కూతుళ్లకు కూడా కుమారులతో సమానంగా హక్కులు ఉంటాయని గుర్తుచేసింది.

ఇలాంటిదే మరో కేసులో వివాహిత కుమార్తెలను ప్రభుత్వ కేటాయింపుల నుంచి మినహాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. వివాహం అయినంత మాత్రాన ఒక కూతురు తన పుట్టింటితో సంబంధాలు కోల్పోతుందని భావించడం కాలం చెల్లిన ఆలోచన అని పేర్కొంది. దశాబ్దాలుగా ఆ భూమిని ఆ కుమార్తె సాగు చేసుకుంటున్నప్పటికీ.. కేవలం పాత సర్క్యులర్ కారణంగానే ఆమెకు హక్కు రాకుండా పోయిందని కోర్టు ఆక్షేపించింది.

చివరిగా కోర్టు ఆదేశాలు ఏమిటి?
ఈ వివాదానికి తెరదించుతూ.. ఆ కుమార్తె 2023లో పెట్టుకున్న దరఖాస్తును పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె అర్హతను బట్టి 2 నెలల్లోగా తండ్రి భూమికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్, పట్టాను ఆమె పేరుపై జారీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.