పెళ్లయిన పురుషుడు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండటం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

పెళ్లయిన పురుషుడు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండటం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

పెళ్లయిన పురుషుడు మరొక మహిళతో 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌'లో ఉండటం చట్టప్రకారం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సామాజిక నైతికత కంటే వ్యక్తిగత హక్కులను కాపాడటమే న్యాయస్థానాల ప్రథమ కర్తవ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక జంట తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అనామిక, నేత్రపాల్ అనే ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేస్తున్నారు. అయితే నేత్రపాల్‌కు ఇదివరకే వివాహం జరిగింది. వీరిద్దరి సంబంధాన్ని అనామిక కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి ఉండటం ఏ రకమైన నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఆ పురుషుడు వివాహితుడైనప్పటికీ, మరొక వయోజనురాలితో కలిసి ఉండటం వల్ల చట్టపరమైన విచారణకు తావులేదని కోర్టు అభిప్రాయపడింది.

న్యాయం, సామాజిక నైతికతను వేర్వేరుగా చూడాలని కోర్టు ఈ సందర్భంగా ఉద్ఘాటించింది. సమాజం ఏమనుకుంటుంది లేదా సామాజిక విలువలు ఏమిటి అనే అంశాలు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయలేవని ధర్మాసనం పేర్కొంది. చట్టప్రకారం నేరం జరగనప్పుడు, కేవలం సామాజిక అభిప్రాయాల ఆధారంగా కోర్టులు పౌరుల హక్కులను కాపాడకుండా ఉండలేవు అని జడ్జీలు వ్యాఖ్యానించారు. మేజర్లుగా ఉన్న వ్యక్తులు తమ ఇష్టప్రకారం కలిసి జీవించేటప్పుడు వారికి రక్షణ కల్పించడం పోలీసుల కనీస బాధ్యత అని కోర్టు గుర్తుచేసింది.

ముఖ్యంగా ఈ జంటపై నమోదైన కిడ్నాప్ కేసులో వారిని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే షాజహాన్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఈ జంట భద్రతకు వ్యక్తిగత బాధ్యత వహించాలని, వారికి తక్షణమే రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనామిక కుటుంబ సభ్యులు ఆ జంటను నేరుగా గానీ, పరోక్షంగా గానీ సంప్రదించకూడదని, వారి నివాసంలోకి ప్రవేశించకూడదని కఠినమైన ఆంక్షలు విధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.