అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి

అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతి

అశ్వారావుపేట, వెలుగు: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందడంతో అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం..  ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఖాన్ పేట గ్రామానికి చెందిన పూల నరేశ్​బాబు అనే వ్యక్తితో అదే మండలం ముచ్చారం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న(30)కు 10 ఏండ్ల కింద వివాహమైంది. వారికి ఒక కూతురు ఉంది. ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో మూడేండ్ల నుంచి అశ్వారావుపేటలోని నరేశ్​ బాబు అక్క దాసరి విజయలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు.

 ఆదివారం లక్ష్మీ ప్రసన్న మెట్లు దిగుతుండగా కాలుజారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న చనిపోయింది. కానీ ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో మృతురాలి తండ్రి ముదిగుండ్ల వెంకటేశ్వరరావు కూతురి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ  మేరకు నరేశ్ బాబుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.