
హైదరాబాద్ : వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. శంషాబాద్ లోని ఆర్బీ నగర్ కాలనీ లో అక్షిత అనే వివాహిత యువతి శనివారం రాత్రి తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్తతో పాటు అత్తా మామలు ఈ ఘటన జరిగిన వెంటనే ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న అక్షిత కుటుంబ సభ్యులు భర్త ఇంటి ఎదుట బైఠాయించారు.
భర్త రాఘవేందర్ రెడ్డితో పాటు అత్తా మామలే తమ కూతురిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన అక్షితను .. రెండేళ్ళ క్రితం శంషాబాద్ కు చెందిన రాఘవేందర్ రెడ్డికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్ళి సమయంలో 50 లక్షలు కట్నంగా చెల్లించామని.. అయితే తమ కూతురిని ఇలా పొట్టన బెట్టుకుంటాడని అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు అక్షిత కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.