
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్ల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ పెరగగా, హ్యుందాయ్, టాటా మోటార్స్ అమ్మకాలు పడ్డాయి. వివిధ బ్రాండ్‌ల అమ్మకాల వివరాలు కింద ఉన్నాయి.
మారుతి సుజుకీ ఇండియా: కిందటేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో మారుతి అమ్మకాలు 7 శాతం వృద్ది చెంది 1,68,089 బండ్ల నుంచి 1,79,791 బండ్లకు పెరిగాయి. అయితే, దేశీయంగా మాత్రం కంపెనీ సేల్స్ కేవలం 0.5 శాతమే వృద్ధి చెందాయి. డొమెస్టిక్ మార్కెట్‌లో 1,38,704 యూనిట్లను అమ్మింది. కంపెనీ ఎగుమతులు మాత్రం బాగా పెరిగాయి. ఇండియా కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకీకి 42 శాతం వాటా ఉంది. గ్రామీణ మార్కెట్లపై దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ వంటి భిన్నమైన వాహనాలను ఆఫర్ చేస్తోంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా: కంపెనీ అమ్మకాలు ఏడాది లెక్కన 5 శాతం క్షీణించాయి. ఏప్రిల్ 2024లో 63,701 యూనిట్లను అమ్మగా, కిందటి నెలలో ఇవి 60,774 యూనిట్లకు తగ్గాయి. దేశీయ అమ్మకాలు 11.6 శాతం తగ్గి 50,201 యూనిట్ల నుంచి 44,374 యూనిట్లకు పడిపోగా, ఎగుమతులు మాత్రం 21.5 శాతం పెరిగి 13,500 యూనిట్ల నుంచి 16,400 యూనిట్లకు ఎగిశాయి. హ్యుందాయ్ 1996 నుంచి భారతదేశంలో 90 లక్షల అమ్మకాలను సాధించింది.
టాటా మోటార్స్ లిమిటెడ్: టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు 7 శాతం పడిపోయాయి. ఏప్రిల్ 2024లో 76,270 యూనిట్లు అమ్మిన కంపెనీ, ఈ ఏడాది ఏప్రిల్‌లో 70,963 యూనిట్లు అమ్మింది. మొత్తం అమ్మకాలు (దేశీయ, అంతర్జాతీయ) 6.2 శాతం తగ్గి 77,521 యూనిట్ల నుంచి 72,753 యూనిట్లకు చేరాయి. ప్యాసింజర్ వాహన అమ్మకాలు 5.6 శాతం తగ్గి 47,883 యూనిట్ల నుంచి 45,199 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) అమ్మకాలు కూడా మార్చి 2025లో 20.56 శాతం పడిపోయి 5,353 యూనిట్లకు తగ్గాయి. ఈవీ సెక్టార్‌లో సవాళ్లు పెరిగాయనే విషయం దీనిని బట్టి అర్థమవుతోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా: కంపెనీ మొత్తం ఆటో అమ్మకాలు ఏడాది లెక్కన 19 శాతం పెరిగి 84,170 బండ్లకు చేరాయి. దేశీయ ఎస్‌యూవీ అమ్మకాలు 28 శాతం ఎగసి 41,008 యూనిట్ల నుంచి 52,330 యూనిట్లకు పెరిగాయి. స్కార్పియో ట్విన్స్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, ఎక్స్‌యూవీ700, కొత్తగా ప్రారంభించిన థార్ రాక్స్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఎస్‌యూవీలపై మహీంద్రా పూర్తిగా దృష్టి పెట్టింది. కిందటి నెలలో అమ్మకాల్లో హ్యుందాయ్, టాటాను అధిగమించింది. మారుతి తర్వాత రెండో ప్లేస్‌లో ఉంది.
కియా ఇండియా: దేశీయ అమ్మకాలలో 18.3 శాతం వృద్ధి సాధించింది. ఏప్రిల్ 2024లో 19,968 బండ్లు అమ్మగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 23,623 బండ్లు అమ్మింది. 8,068 సోనెట్ కార్లను, 6,135 సెల్టోస్ కార్లను విక్రయించింది. కొత్తగా ప్రారంభించిన సైరోస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ద్వారా కియా సేల్స్ పెరిగాయి. డెలివరీలు సకాలంలో చేపట్టడం, ప్రీమియం ఫీచర్ల అందిస్తుండడంతో కంపెనీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్: టయోటా అమ్మకాలు ఏడాది లెక్కన ఈ ఏడాది ఏప్రిల్‌లో 33 శాతం వృద్ధి నమోదు చేశాయి. కంపెనీ సేల్స్ 20,494 యూనిట్ల నుంచి 27,324 యూనిట్లకు చేరాయి. దేశీయ అమ్మకాలు 24,833 యూనిట్లుగా, ఎగుమతులు 2,491 యూనిట్లుగా ఉన్నాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీలు, ముఖ్యంగా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సేల్స్ భారీగా పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 68 శాతంగా ఉంది. టయోటా 2024–25 లో 3,37,148 బండ్లను అమ్మింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 28 శాతం గ్రోత్ నమోదైంది.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా: కంపెనీ సేల్స్ ఏప్రిల్‌లో 23 శాతం పెరిగాయి. ఏప్రిల్ 2024లో నమోదైన 4,725 యూనిట్లతో పోలిస్తే ఈసారి సేల్స్ 5,829 యూనిట్లకు చేరుకున్నాయి. విండ్సర్, కామెట్, జేఎస్ ఈవీ వంటి బండ్లకు డిమాండ్ బాగుంది.