V6 News

మారుతీ సుజుకీ లాభం రూ.3 వేల 659 కోట్లు.. షేరుకు రూ.140 చొప్పున డివిడెండ్

మారుతీ సుజుకీ లాభం రూ.3 వేల 659 కోట్లు.. షేరుకు రూ.140 చొప్పున డివిడెండ్
  • మార్చి క్వార్టర్​లో 6.45 శాతం తగ్గిన లాభం
  • మొత్తం ఆదాయం రూ.52,462 కోట్లు
  • రూ.50 వేల కోట్ల మార్కును దాటిన అమ్మకాలు

న్యూఢిల్లీ: మన దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా 2026 మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.3,659 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. వాహన అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, మార్క్ టు మార్కెట్ అకౌంటింగ్​ ప్రభావం వల్ల లాభం 6.45 శాతం తగ్గింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్​లో కంపెనీ రూ.3 ,911.1 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బాండ్ ఈల్డ్ మార్పుల వల్ల వచ్చిన నోషనల్ లాస్, నిర్వహణేతర ఆదాయం తగ్గడం లాభం క్షీణతకు ప్రధాన కారణాలని సంస్థ వెల్లడించింది. 

నాలుగో క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 28.2 శాతం పెరిగి రూ.52,462.5 కోట్లకు చేరింది. నికర అమ్మకాల విలువ రూ.50 వేల కోట్ల మార్కును దాటడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ క్వార్టర్​లో ఖర్చులు రూ.48,125.3 కోట్లుగా నమోదయ్యాయి. ఈసారి 6,76,209 యూనిట్లు విక్రయించి అత్యుత్తమ క్వార్టర్ రికార్డును నమోదు చేసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 5,38,994 యూనిట్లు కాగా, 1,37,215 యూనిట్లను ఎగుమతి చేసింది. బోర్డు ఒక్కో షేరుకు రూ.140 రికార్డు స్థాయి డివిడెండ్ సిఫార్సు చేసింది.

వార్షిక లాభం రూ.14 వేల కోట్లు
మొత్తం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 1.24 శాతం వృద్ధితో రూ.14,679.5 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.1,83,316 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో 24,22,713 వాహనాలను విక్రయించింది. జీఎస్​టీ తగ్గింపు వల్ల రెండో అర్థభాగంలో దేశీయ మార్కెట్ వేగంగా వృద్ధి చెందింది. ఉత్పత్తి సామర్థ్యం పరిమితి కారణంగా అమ్మకాలపై ప్రభావం పడిందని కంపెనీ పేర్కొంది. ఏడాది చివరలో 1.9 లక్షల కస్టమర్ ఆర్డర్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వీటిలో 1.3 లక్షల ఆర్డర్లు 18 శాతం జీఎస్​టీ పరిధిలోని చిన్న కార్లే ! డీలర్ల వద్ద స్టాక్ కూడా 12 రోజులకు పడిపోయిందని మారుతీ సుజుకీ ప్రకటించింది.

పెట్టుబడుల కోసం రూ.14 వేల కోట్లు
2027 ఆర్థిక సంవత్సరం కోసం కంపెనీ రూ.14 వేల కోట్ల భారీ మూలధన వ్యయాన్ని కేటాయించింది. పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌ను అందుకోవడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ పెట్టుబడి పెడుతున్నట్లు చైర్మన్ ఆర్ సీ భార్గవ వెల్లడించారు. హర్యానాలోని ఖార్ఖోడా. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని హన్సల్‌‌‌‌‌‌‌‌పూర్ ప్లాంట్లలో కొత్త ఉత్పత్తి లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏటా అదనంగా 5 లక్షల కార్లు తయారవుతాయి. చిన్న కార్లకు మార్కెట్లో మంచి భవిష్యత్తు ఉందని, ఆయన అభిప్రాయపడ్డారు. 

పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత కార్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌పై పెద్దగా ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల కంపెనీపై కొంత ఒత్తిడి ఉందని, సరైన సమయంలో కార్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని భార్గవ చెప్పారు.