- తగ్గుతూనే ఉన్న అమ్మకాలు
- దూసుకొస్తున్న పోటీ కంపెనీలు
- భారీగా కొత్త మోడల్స్ లాంచ్
న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతికి ఆటోమొబైల్ మార్కెట్‌పై పట్టు సడలుతోంది. అమ్మకాలు, మార్కెట్ వాటాలు తగ్గుతున్నాయి. లోకల్, గ్లోబల్ఆటో కంపెనీలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రయాణీకుల వాహనాల (పీవీలు) మార్కెట్లో ఎప్పటి నుంచో టాప్‌లో ఉన్న మారుతి సుజుకి హవా తగ్గుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం కంపెనీ మార్కెట్ వాటా 13 సంవత్సరాల కనిష్ట స్థాయి 39.26 శాతానికి పడిపోయింది.
విపరీత పోటీ, వినియోగదారుల అభిరుచులు మారడం దీనికి ప్రధాన కారణాలు. మారుతి మార్కెట్ వాటా వరుసగా మూడో సంవత్సరంలోనూ తగ్గింది. ఒకప్పుడు 50 శాతం వాటాతో మార్కెట్‌ను ఏలిన ఈ కంపెనీ అమ్మకాలు పడిపోతుండటం పోటీదారులకు కలసి వస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మారుతి విలువ 57 బిలియన్ డాలర్లు (రూ.5.3 లక్షల కోట్లు) దాటినప్పటికీ దేశీయంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. భారతీయ కస్టమర్లు చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లకు బదులు స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీలు) పై ఆసక్తి చూపుతున్నారు.
వీటి అమ్మకాలు గత ఏడాది11 శాతం పెరిగాయి. ఈ మార్పు ప్రత్యర్థి కంపెనీలకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఎక్కువగా చిన్న కార్ల విభాగంపై దృష్టి పెట్టే మారుతి కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టు వేగంగా వ్యూహాన్ని మార్చుకోవడంలో విఫలమైంది. ఈ కంపెనీకి కీలకమైన హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాల వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో రెండు శాతం కంటే తక్కువే ఉంది.
- పెరుగుతున్న పోటీ కంపెనీల వాటా
మహీంద్రా అండ్ మహీంద్రా , హ్యుందాయ్, టాటా, ఎంజీ మోటార్స్, స్కోడా వంటివి భారత మార్కెట్లో తమ వాటాను గణనీయంగా పెంచుకున్నాయి. కొత్త కొత్త డిజైన్లను, ఫీచర్లను ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. సరైన సమయంలో ధరలను మార్చడం, తరచూ కొత్త మోడళ్లను తీసుకురావడం, ప్రీమియం ఫీచర్లను అందించడం ద్వారా మహీంద్రా మొదటి క్వార్టర్ లో రెండో స్థానానికి చేరుకుంది.
థార్, బొలెరో, స్కార్పియో మోడళ్ల విజయంతో మార్కెట్ వాటాను 14.21 శాతానికి పెంచుకుంది. టాటా మోటార్స్ నెక్సాన్, పంచ్ మోడళ్లతో 13 శాతం వాటాతో గట్టి పోటీ ఇస్తోంది. టొయోటా భాగస్వామ్యంతో వచ్చిన గ్రాండ్ విటారా కంటే టొయోటా హైరైడర్ ఎక్కువ అమ్ముడవుతోంది. ప్రీమియం ఎస్యూవీ టొయోటా ఇన్నోవా హైక్రాస్ నెలకు 11 వేల బండ్లు అమ్ముడవుతున్నాయి. మారుతి ఇన్విక్టో మోడల్ అమ్మకాలు 400 యూనిట్లు దాటడం లేదు.
- బ్రాండ్ వాల్యూ తగ్గుతోంది..
ప్రీమియం విభాగంలో మారుతి వాటా తగ్గుతోంది. టొయోటా బ్రాండ్ తో వస్తున్న హైరైడర్ వంటి సుజుకి మోడళ్లు, మారుతి గ్రాండ్ విటారా కంటే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. గ్లోబల్ కార్ల కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. 2031 నాటికి మళ్లీ 50 శాతం మార్కెట్ వాటాను సాధించాలన్నది మారుతి లక్ష్యం. దీనిని చేరుకోవడం అంత సులువు కాకపోవచ్చు.
- ఆటోమొబైల్ ఎనలిస్ట్ గౌరవ్ వంగల్
