తెలంగాణ బాక్సర్​ అవకాశాలకు మేరీకోమ్‌‌ అడ్డు!

తెలంగాణ బాక్సర్​ అవకాశాలకు మేరీకోమ్‌‌ అడ్డు!

తెలంగాణ బాక్సర్​ అవకాశాలకు మేరీకోమ్‌‌ అడ్డు!
ఒకే కేటగిరీలో పోటీతో సమస్య
జరీన్‌‌తో ట్రయల్స్‌‌ లేకుండా వరల్డ్‌‌ బాక్సింగ్‌‌కు మేరీ ఎంపిక
ఒలింపిక్స్‌‌ క్వాలిఫయర్స్‌‌కు కూడా బీఎఫ్‌‌ఐ అనుమతి!

(వెలుగుక్రీడా విభాగం) : మేరీకోమ్‌‌‌‌, నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌. ఒకరు ప్రపంచ బాక్సింగ్‌‌‌‌ క్వీన్‌‌‌‌ అయితే.. మరొకరు ఆ బాటలోనే ఉన్న   ప్రతిభావంతురాలు. ఆరుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా మేరీ ఎనలేని కీర్తిని అందుకుంటే.. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో ఆటలోకి అడుగుపెట్టిన జరీన్‌‌‌‌ తన అరాధ్య క్రీడాకారిణి అంత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తోంది. కానీ, తెలంగాణ యువ ప్లేయర్‌‌‌‌ ప్రయాణానికి ఆ లెజెండే అడ్డుగా వస్తోంది. ఇద్దరూ 51 కేజీల వెయిట్‌‌‌‌ కేటగిరీలో పోటీ పడుతుందడడం వల్లే ఈ సమస్య తలెత్తింది. కానీ, ఇందులో మన హైదరాబాదీ తప్పేం లేదు. ఆమె ముందు నుంచి ఇదే కేటగిరీలో ఆడుతోంది. మొన్నటి వరకు 48 కేజీల్లో ఉన్న మేరీకోమ్‌‌‌‌.. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో ఈ కేటగిరీని రద్దు చేయడంతో 51 కేజీలకు మారింది. ఈ నిర్ణయమే నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌కు శరాఘాతమైంది.

51కేజీల విభాగంలో ఒలింపిక్స్‌‌‌‌లో పాల్గొనాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకున్న నిఖత్​కు  మేరీ రూపంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఒలింపిక్స్‌‌‌‌ క్వాలిఫికేషన్సే కాదు.. ఇటీవల ముగిసిన వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పాల్గొనాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నిఖత్‌‌‌‌కు మేరీనే అడ్డొచ్చింది. ఈ టోర్నీకి ఆగస్టులో మేరీకోమ్‌‌‌‌తో ట్రయల్స్‌‌‌‌ ఏర్పాటు చేసిన సెలెక్టర్లు చివరి నిమిషంలో రద్దు చేసి జరీన్‌‌‌‌కు షాకిచ్చారు. ‘చిన్న ఏజ్‌‌‌‌లోనే నిఖత్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బరిలోకి దిగకుండా.. ఫ్యూచర్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని ఆమెను రక్షిస్తున్నాం’అంటూ బాక్సింగ్​ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (బీఎఫ్‌‌‌‌ఐ)​ ఇచ్చిన వివరణ కూడా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే 2016లోనే నిఖత్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో పోటీ పడింది. అప్పుడామె వయసు మరింత తక్కువే కదా?. ఇప్పుడేమో తన నిబంధనకే తాను కట్టుబడలేకపోతోందా ఫెడరేషన్‌‌‌‌. వరల్డ్‌‌‌‌ బాక్సింగ్​లో గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌ నెగ్గిన వారినే ఫిబ్రవరిలో జరిగే ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్‌‌‌‌కు నేరుగా సెలెక్ట్‌‌‌‌ చేస్తామన్న బీఎఫ్‌‌‌‌ఐ ఇప్పుడు కాంస్యం గెలిచిన వారినీ ఎంపిక చేస్తామంటోంది. ఎందుకంటే వరల్డ్‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌లో మేరీ కాంస్యమే గెలిచింది. ఆమె కోసమే ఫెడరేషన్‌‌‌‌ నిబంధన సడలిస్తోందని  అర్థం అవుతోంది.

ట్రయల్స్‌‌‌‌ ఆడితే పోయేదేంటి

స్టార్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ కావడంతో ఈ విషయంలో బీఎఫ్‌‌‌‌ఐ మేరీ మద్దతిస్తోంది. ఇప్పటికే ఎంపీగా పని చేసిన మేరీ స్థాయి దృష్ట్యా ఆమె మాటకు ఎదు రుచెప్పే పరిస్థితి లేదు. అదే టైమ్‌‌‌‌లో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌తో కెరీర్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పాలని భావిస్తున్న లెజెండరీ    బాక్సర్‌‌‌‌కు చాన్సిస్తే తప్పేంటి అని బీఎఫ్‌‌‌‌ఐ భావిస్తోంది. ఫెడరేషన్ వాదన కూడా కరెక్టే. కానీ, ఆమెకు ఫేవర్‌‌‌‌ చేసేక్రమంలో మరో టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌కు అన్యాయం చేయకూడదు. టాలెంట్‌‌‌‌ విషయంలో నిఖత్‌‌‌‌ తక్కువేం కాదు. ఈ ఏడాది స్ట్రాన్జా మెమోరియల్‌‌‌‌ టోర్నీలో గోల్డ్‌‌‌‌, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ నెగ్గి జోరు మీదుంది. ఇతర వెయిట్‌‌‌‌ కేటగిరీల్లో రాణిస్తున్న మంజు రాణి, జమునా బొరొ వంటి యువ బాక్సర్లకు ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ ట్రయల్స్‌‌‌‌ నుంచి మేరీని మినహాయింపు ఇవ్వాలని ఫెడరేషన్‌‌‌‌ డిసైడేతే ఆ విషయాన్ని ముందుగా నిఖత్‌‌‌‌కు చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయాలి. అదే టైమ్‌‌‌‌లో ఈ విషయంలో మేరీ ‘బెట్టు’వీడితే బాగుంటుంది. తన ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌, ప్రస్తుత ఫామ్‌‌‌‌ దృష్ట్యా ట్రయల్స్‌‌‌‌లో నిఖత్‌‌‌‌పై విజయం ఆమెకు పెద్ద కష్టం కాబోదు. నిఖత్‌‌‌‌ కూడా అదే చెబుతోంది. గెలుపోటములు కాదు సరైన అవకాశమే ముఖ్యమని అంటోంది. కెరీర్‌‌‌‌లో ఎన్నో ఒడిదుడుకులను దాటొచ్చిన మేరీకోమ్‌‌‌‌కు ‘అవకాశం’విలువ ఏంటో బాగా తెలుసు. తనను తాను నిరూపించుకోవడానికి సెలెక్షన్ కమిటీ, ఫెడరేషన్‌‌‌‌ పెద్దలతో ఎంతగా పోరాడిందో ఆమె బయోపిక్‌‌‌‌ (మేరీకోమ్‌‌‌‌)ను సిల్వర్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌పై చూసిన వారందరికీ తెలుసు. తాను ఆడే కేటగిరీలో ఓ లెజెండరీ ప్లేయర్‌‌‌‌ ఉండడం వల్ల నిఖత్‌‌‌‌ నష్టపోకూడదు. మరి, మేరీ మనసు మార్చుకుంటుందా? జరీన్​కు న్యాయం జరుగుతుందా?  చూడాలి.

సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌కు నిఖత్‌‌‌‌ లెటర్‌‌‌‌

ఒలింపిక్స్‌‌‌‌ క్వాలిఫికేషన్స్‌‌‌‌ కోసం మేరీతో తనకు పోటీ ఏర్పాటు చేయాలని కోరుతూ సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ కిరణ్‌‌‌‌ రిజిజుకు నిఖత్ లేఖ రాసింది. ‘23 గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ నెగ్గిన మైకేల్‌‌‌‌ ఫెల్ఫ్స్‌‌‌‌ ప్రతీసారి ఒలింపిక్స్‌‌‌‌కు క్వాలిఫై వస్తున్నప్పుడు మిగతా వాళ్లం కూడా అదే చేయాల్సింది. ట్రయల్స్‌‌‌‌లో పాల్గొన్న తర్వాత మేరీకోమ్‌‌‌‌ అయినా నేను అయినా లేదంటే మరో బాక్సర్‌‌‌‌ క్వాలిఫై అయితే ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు పేరు     తెచ్చేందుకు మాకందరికీ సమాన అవకాశం లభించిందని తెలుసుకొని కనీసం రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాం. నన్ను కుంగిపోయేలా చేయరని అనుకుంటున్నా’అని నిఖత్‌‌‌‌ పేర్కొన్నది.

నిఖత్‌‌‌‌తో పోటీకి మేరీ అయిష్టత

నిఖత్‌‌‌‌ జరీన్‌‌‌‌తో ట్రయల్స్‌‌‌‌లో పోటీపడేందుకు మేరీకోమ్‌‌‌‌కు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకో కారణం ఉంది. ఈ ఏడాది మేలో జరిగిన ఇండియా ఓపెన్‌‌‌‌ సెమీ ఫైనల్లో మేరీ చేతిలో జరీన్‌‌‌‌ ఓడిపోయింది. అయితే, ఈ బౌట్‌‌‌‌కు ముందు ‘నా అభిమాన బాక్సర్‌‌‌‌ మేరీతో పోటీ పడేందుకు ఉత్సాహంగా ఉన్నా. ఆమె ప్లాన్స్‌‌‌‌ తెలుసుకొని గట్టి పోటీ ఇస్తా’అని నిఖత్‌‌‌‌ చేసిన కామెంట్‌‌‌‌ మేరీకోమ్‌‌‌‌ అహాన్ని దెబ్బతీసింది. బౌట్​ ముగిసిన తర్వాత జరీన్‌‌‌‌ ఎవరో తనకసలు తెలియదన్న మేరీ… అలాంటి అమ్మాయి తనకు సవాల్‌‌‌‌ విసురుతా అని అంటుందా? ఒక్క మెడల్‌‌‌‌ నెగ్గిన బాక్సర్‌‌‌‌కు ఇంత అహం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత తన పరపతిని ఉపయోగించి నిఖత్‌‌‌‌తో ‘వరల్డ్​’ట్రయల్స్‌‌‌‌ను చివరి నిమిషంలో రద్దు చేయించుకుంది.

జరీన్​కు బింద్రా మద్దతు

నిఖత్‌‌కు లెజెండరీ షూటర్‌‌ అభినవ్‌‌ బింద్రా మద్దతు పలికాడు. ఆమెతో ట్రయల్స్‌‌లో పాల్గొనాలని మేరీకి సూచించాడు. మేరీకోమ్‌‌ అంటే తనకు గౌరవం ఉందన్న బింద్రా.. అథ్లెట్లు తమనుతాను ఎప్పుడూ ప్రూవ్​ చేసుకోవాలన్నాడు.