
లాహోర్: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PMLN) పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. చౌదరీ షుగర్ మిల్స్ కేసులో పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అధికారులు గురువారం మరియం నవాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ లోని కోట్ లక్ పత్ జైల్లో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు మరియం నవాజ్ వెళ్తుండగా తండ్రిముందే ఆమెను అధికారులు అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది.
మధ్యాహ్నం 3 గంటలకు ఆమె NAB కార్యాలయానికి వెళ్లాలని భావించినప్పటికీ.. ఈలోగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అవెన్ ఫీల్డ్ అవినీతి, మనీ ల్యాండరింగ్ కేసులో 7 సంవత్సరాలు జైలు శిక్ష పడగా.. తన భర్త, తండ్రితో పాటు మరియం కూడా గతేడాది జైల్లో గడిపారు. కొద్దినెలల్లోనే ఈ ముగ్గురూ బెయిల్ పై విడుదల కాగా.. అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ మళ్లీ లాహోర్ జైలుకు వెళ్లారు.
అయితే ఇంతకు ముందు ఆమెకు చౌదరి షుగర్ మిల్స్ కేసులో వివరాలు సమర్పించాల్సిందిగా నాబ్ సమన్లు జారీ చేసిందని.. ఈ క్రమంలోనే గురువారం మరియం నవాజ్ ను మరోసారి అరెస్ట్ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది.