
తాను జైలు శిక్ష అనుభవించే సమయంలో తనకు ఎదురైన అసౌకర్యాల గురించి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ వైస్ ప్రెసిడెంట్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తే మరియం నవాజ్ షరీఫ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గత ఏడాది చౌదరి షుగర్ మిల్స్ కేసులో మరియం నవాజ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె విడుదలయ్యారు. అయితే తాను జైలులో ఉన్నప్పుడు జైలు అధికారులు తన జైలు గదిలో, బాత్రూంలో సీసీ కెమెరాలు అమర్చారని ఆమె తెలిపారు. తాను ఇప్పటివరకు రెండుసార్లు జైలుకెళ్లానని ఆమె తెలిపారు. జైలులో తాను ఎలాంటి జీవితం గడిపానో చెబితే అధికారులు తల ఎత్తుకోలేరని ఆమె అన్నారు. పోలీసులు తనను తన తండ్రి నవాజ్ షరీఫ్ ముందే అరెస్టు చేశారని, ఆ సమయంలో తనపై దాడి చేశారని ఆమె తెలిపారు. పాకిస్తాన్‌లో మహిళలకు భద్రత కరువైందని ఆమె అన్నారు. ఒక మహిళ పాకిస్తాన్‌లో కానీ, మరో దేశంలో కానీ ఏ మాత్రం బలహీనురాలు కాదని ఆమె అన్నారు. పాక్‌లో ప్రస్తుతమున్నప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి సైనిక అధికారులతో చర్చలు జరపడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు.
తాను రాష్ట్ర సంస్థలకు వ్యతిరేకం కాదని, రహస్యంగా సంభాషణలు ఉండవని ఆమె నొక్కి చెప్పింది. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) వేదిక ద్వారా సంభాషణల ఆలోచనను కూడా చర్చించవచ్చని ఆమె అన్నారు.
For More News..